IPL 2023: టాప్‌ లేపిన చెన్నై

చెన్నై ఎక్స్‌ప్రెస్‌ దూసుకుపోతోంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ కొట్టేసింది. ‘రహానె 2.0’ చెన్నై  విజయ సారథి.

Updated : 24 Apr 2023 07:22 IST

ఖాతాలో వరుసగా మూడో విజయం
రెచ్చిపోయిన రహానె, దూబె
కోల్‌కతాకు వరుసగా నాలుగో ఓటమి

చెన్నై ఎక్స్‌ప్రెస్‌ దూసుకుపోతోంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ కొట్టేసింది. ‘రహానె 2.0’ చెన్నై  విజయ సారథి. ఆశ్చర్యకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ అతడు మరోసారి రెచ్చిపోగా.. దూబె సైతం కోల్‌కతా బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. విధ్వంసక విన్యాసాలతో జేసన్‌ రాయ్‌, రింకూ ఆశలు రేపినా నైట్‌రైడర్స్‌కు పరాభవం తప్పలేదు. 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మాటలా?

చెన్నై జోరు కొనసాగిస్తోంది. ఐపీఎల్‌లో వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం 49 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను మట్టికరిపించింది. రహానె (71 నాటౌట్‌; 29 బంతుల్లో 6×4, 5×6), శివమ్‌ దూబె (50; 21 బంతుల్లో 2×4, 5×6), కాన్వే (56; 40 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. జేసన్‌ రాయ్‌ (61; 26 బంతుల్లో 5×4, 5×6), రింకూ సింగ్‌ (53 నాటౌట్‌; 33 బంతుల్లో 3×4, 4×6) గట్టి ప్రయత్నమే చేసినా ఛేదనలో కోల్‌కతా 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదో విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.

జేసన్‌, రింకూ మెరిసినా..: ఒక్క పరుగుకే రెండు వికెట్లు. ఎనిమిదో ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ (20) ఔటయ్యేప్పటికి 46. చాలా పెద్ద లక్ష్య ఛేదనలో మెరుపు ఆరంభం అవసరమైన కోల్‌కతా పరిస్థితి. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ దాదాపు 15. ఇక ఆ జట్టుకు కష్టమే అనిపించింది. కానీ వీరబాదుడు బాదిన జేసన్‌ రాయ్‌ కోల్‌కతాను రేసులో నిలిపాడు. అతడు ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో ఆ జట్టు 14.2 ఓవర్లలో 135/4తో చెన్నైని కలరవర పెట్టింది. అయితే తీక్షణ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రాయ్‌.. రాణా (20)తో నాలుగో వికెట్‌కు 24, రింకూతో అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. రాయ్‌ ఔటైనా.. రింకూ జోరు పెంచడం, మరో విధ్వంసకారుడు రసెల్‌ క్రీజులో ఉండడంతో.. కోల్‌కతా చివరి అయిదు ఓవర్లలో 99 పరుగులు చేయాల్సి ఉన్నా చెన్నై ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. రింకూ జోరుతో 16వ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. బౌండరీల మోతకు తెరిపినిస్తూ చక్కగా బౌలింగ్‌ చేసిన పతిరన 17వ ఓవర్లో ఎనిమిది పరుగులే ఇచ్చి రసెల్‌ను ఔట్‌ చేయడంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. చివరి మూడు ఓవర్లలో 72 పరుగులు చేయాల్సిన స్థితిలో కోల్‌కతా ఓటమి దాదాపుగా ఖాయమైంది. 18వ ఓవర్లో తుషార్‌ 13 పరుగులే ఇచ్చి వీజ్‌ను  ఔట్‌ చేయడంతో ఆ జట్టు ఓటమి లాంఛనమే అయింది.

కింగ్స్‌ సూపర్‌: మొదట చెన్నై ఇన్నింగ్స్‌ అంతా విధ్వంసమే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి చక్కని బ్యాటింగ్‌తో అదిరే ఆరంభాన్నిచ్చారు కాన్వే, రుతురాజ్‌. ఎనిమిదో ఓవర్లో రుతురాజ్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 73. చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయమనింపించింది. కానీ 235 మాత్రం ఏమాత్రం ఊహంచనిదే. ఆఖరి ఎనిమిది ఓవర్లలో చెన్నై ఏకంగా 123 పరుగులు రాబట్టింది. కారణం రహానె, శివమ్‌ దూబెల నిర్దాక్షిణ్య బాదుడే. ఏ బౌలర్‌నూ లెక్క చేయని ఈ జోడీ సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. 13వ ఓవర్లో కాన్వే ఔట్‌ కావడంతో రహానెకు తోడయ్యాడు దూబె. బౌలర్లకు ఊపిరిసలపనివ్వని ఈ జంట ఎడాపెడా సిక్స్‌లతో హోరెత్తించింది. రహానె 24 బంతుల్లో, దూబె 20 బంతుల్లో అర్ధశతకాలను అందుకున్నారు.. దూబెతో మూడో వికెట్‌కు కేవలం 32 బంతుల్లో 85 పరుగులు జోడించిన రహానె.. జడేజా (18; 8 బంతుల్లో 2×6)తో కేవలం 13 బంతుల్లోనే 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.


చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (బి) సుయాశ్‌ 35; కాన్వే (సి) వీజ్‌ (బి) వరుణ్‌ 56; రహానె నాటౌట్‌ 71; దూబె (సి) రాయ్‌ (బి) క్రెజోలియా 50; జడేజా (సి) రింకూ (బి) క్రెజోలియా 18; ధోని నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 3

మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 235;

వికెట్ల పతనం: 1-73, 2-109, 3-194, 4-232;

బౌలింగ్‌: ఉమేశ్‌ 3-0-35-0; వీజ్‌ 3-0-38-0; వరుణ్‌ 4-0-49-1; క్రెజోలియా 3-0-44-2; నరైన్‌ 2-0-23-0; సుయాశ్‌ 4-0-29-1; రసెల్‌ 1-0-17-0
కోల్‌కతా ఇన్నింగ్స్‌: జగదీశన్‌ (సి) జడేజా (బి) దేశ్‌పాండే 1; నరైన్‌ (బి) ఆకాశ్‌ 0; వెంకటేశ్‌ అయ్యర్‌ ఎల్బీ (బి) మొయిన్‌ 20; నితీష్‌ రాణా (సి) రుతురాజ్‌ (బి) జడేజా 27; జాసన్‌ రాయ్‌ (బి) తీక్షణ 61; రింకూ సింగ్‌ నాటౌట్‌ 53; రసెల్‌ (సి) దూబె (బి) పతిరన 9; వీజ్‌ ఎల్బీ (బి) దేశ్‌పాండే 1; ఉమేశ్‌ (సి) కాన్వే (బి) తీక్షణ 4; వరుణ్‌ చక్రవర్తి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186;

వికెట్ల పతనం: 1-1, 2-1, 3-46, 4-70, 5-135, 6-162, 7-171, 8-180;

బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 4-0-29-1; తుషార్‌ దేశ్‌పాండే 4-0-43-2; తీక్షణ 4-0-32-2; మొయిన్‌ అలీ 1-0-20-1; జడేజా 3-0-34-1; పతిరన 4-0-27-1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని