Glenn Maxwell: మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?

ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్‌ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్‌తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. 

Published : 02 May 2024 10:31 IST

క్రికెట్లో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. తమ బ్యాటింగ్‌తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్లనే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకప్పుడు ఇండియన్ టీంలో సచిన్ సహా గ్రేట్ బ్యాటర్లున్నప్పటికీ.. సెహ్వాగ్ పీక్ ఫామ్‌లో ఉన్నపుడు అతడి ఆట చూడటాన్ని అభిమానులు ఎంతగానో ఆస్వాదించేవారు. క్రీజులో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఔటయ్యే వరకు బాదుడే బాదుడు అన్నట్లుగా సాగే అతడి ఆటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. అలాగే దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్యాటర్లలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒకడు. డివిలియర్స్ తరహాలోనే క్రీజులో అద్భుత విన్యాసాలు చేస్తూ మెరుపు షాట్లతో అభిమానులను అలరించే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell). ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన మ్యాక్సీ ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ పేలవ ఫామ్‌తో లీగ్ మధ్యలో తనకుతానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్. 

అవతలి భీకరమైన వేగంతో బెంబేలెత్తించే పేసర్ ఉండొచ్చు. బంతిని గింగిరాలు తిప్పే మేటి స్పిన్నర్ ఉండొచ్చు. కానీ బౌలర్ ఎవరైనా, బంతి ఎలాంటిదైనా క్రీజులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నాడంటే బౌండరీ బాట పట్టాల్సిందే. ఫోరో, సిక్సో కొట్టాలని అతను ఫిక్సయ్యాడంటే.. బంతి బౌండరీ అవతల కనిపించాల్సిందే. ఫుల్ లెంగ్త్‌లో పడితే గోల్ఫ్ షాట్‌ ఆడి లాంగాన్‌లోనో, లాంగాఫ్‌లోనో సిక్సర్‌గా మలుస్తాడు. యార్కర్ పడితే ర్యాంప్ షాట్ ఆడి ఫైన్‌లో స్టాండ్స్‌కు పంపిస్తాడు. బంతిని అర్థం కానట్లు స్పిన్ చేస్తుంటే స్టాన్స్ మార్చుకుని స్విచ్ హిట్‌గా సిక్సర్ కొట్టేస్తాడు. బౌన్సర్ వేసినా సరే.. దాన్ని అప్పర్ కట్టో, స్కూప్‌తోనో వికెట్ల వెనక బౌండరీ దాటించేస్తాడు. ఇలా బంతిని బాదడానికి మ్యాక్స్‌వెల్ దగ్గర ఎన్నో షాట్లు ఉన్నాయి. క్రీజులో అతడి విన్యాసాలు చూస్తుంటే నృత్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఏబీ డివిలియర్స్ తర్వాత ఇలా రకరకాల విన్యాసాలతో అందంగా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించే.. బౌలర్లను ఏడిపించే బ్యాటర్ మ్యాక్స్‌వెలే. మన సూర్యకుమార్ యాదవ్ కూడా ఏబీకి వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మ్యాక్స్‌వెల్ ఊచకోత, రేంజ్ ఆఫ్ షాట్లు వేరే లెవెల్ అని చెప్పాలి. 2014లో పంజాబ్ జట్టుకు ఆడుతూ సంచలన ఇన్నింగ్స్‌లతో అతను ఐపీఎల్ అభిమానుల ఫేవరెట్‌గా మారాడు. ఆ తర్వాత ఆర్సీబీ జట్టులోకి వచ్చి కొన్ని సీజన్లలో ఇక్కడా రాణించాడు. కానీ ఈసారి మాత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ 5.33 సగటు, 94 స్ట్రైక్ రేట్‌తో 32 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కోల్‌కతాతో మ్యాచ్‌లో చేసినవే 28. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో కలిపి అతను చేసింది 4 పరుగులే. బౌలింగ్‌లో మ్యాక్సీ 5 వికెట్లు తీశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు మ్యాక్సీని పక్కన పెట్టింది టీం. అయితే ముందు అతడికి గాయమని వార్తలు వచ్చాయి. కానీ మ్యాక్సీనే తర్వాత అసలు విషయం చెప్పాడు. తనకు తానుగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. మానసికంగా, శారీరకంగా తనకు విశ్రాంతి అవసరమని అతను భావించాడు. కొన్ని మ్యాచ్‌ల గ్యాప్ తర్వాత గుజరాత్‌తో మ్యాచ్‌లో అతను పునరాగమనం చేశాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌  అవకాశం రాలేదు. 

మంచి ఫామ్‌తో వచ్చి..

నిజానికి మ్యాక్స్‌వెల్ ఈ ఐపీఎల్ ఆరంభానికి ముందు మంచి ఫాంలోనే ఉన్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అతను ఎలా చెలరేగాడో గుర్తుండే ఉంటుంది. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ను అంత సులువుగా మరిచిపోలేం. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 292 పరుగుల లక్ష్యం ఉంది. ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు పడిపోయాయి. ఇక కంగారూలకు ఘోర పరాభవం తప్పదని అందరూ ఫిక్సయిపోయారు. ఆ స్థితిలో మ్యాక్స్‌వెల్ సాధించిన అజేయ డబుల్ సెంచరీ (128 బంతుల్లో 201 నాటౌట్) చరిత్రాత్మకం. ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేదే. ఇక ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు వెస్టిండీస్‌తో రెండో టీ20లో మ్యాక్సీ మరో మేటి ఇన్నింగ్స్ (55 బంతుల్లో 120 నాటౌట్) ఆడాడు. 50 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 14 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 148/4. కానీ మ్యాక్సీ విధ్వంసంతో ఇన్నింగ్స్ చివరికి ఏకంగా 241 పరుగులు చేసింది. ఈ ఫామ్ చూసి ఐపీఎల్‌లో సైతం అతను రెచ్చిపోతాడని అనుకొని అతడిపై అంచనాలు పెంచుకున్నారు. కానీ లీగ్‌లోకి వచ్చాక మ్యాక్సీ తేలిపోయాడు. వరుస వైఫల్యాలు చవిచూశాడు. అసలే ఐపీఎల్‌లో బెంగళూరు పరిస్థితి కొన్నేళ్లుగా అంతంతమాత్రం. ఈసారి మరీ ఘోరంగా తయారైంది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ జట్టును రక్షించకపోగా.. ఇంకా పతనానికి కారకుడయ్యాడు. మ్యాక్స్‌వెల్ ఇలా లీగ్ మధ్యలో పేలవమైన ఫామ్‌ వల్ల తనకు తానుగా విరామం తీసుకోవడం ఇది తొలిసారి కాదు. 2019 అక్టోబరులో ఆస్ట్రేలియా జట్టుకు కొన్ని నెలలు దూరంగా ఉండి.. తర్వాత పునరాగమనం చేశాడు. ఆపై ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసుకు దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో కొంచెం ఊపులోకొచ్చింది. అయినా సరే లీగ్ దశ దాటడం కష్టంగానే ఉంది. మరి రాబోయే మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఎంత బాగా ఆడుతుందో.. అందులో మ్యాక్స్‌వెల్ ఆట ఎలా ఉంటుందో చూడాలి.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు