England - T20 World Cup : ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ ఎలా మొదలు పెట్టింది.. ఎలా ముగించింది?

టీ20 ప్రపంచకప్‌ 2022ని ఇంగ్లాండ్‌ (England won t20 worldcup 2022) గెలిచిన నేపథ్యంలో 20 రోజులు వెనక్కి వెళ్లి ఇంగ్లాండ్‌ ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. 

Updated : 13 Nov 2022 19:57 IST

టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్‌ (England) నిలిచింది. అయితే వారికి ఈ విజయం అంత ఈజీగా రాలేదు. చిన్న జట్టు మీద ఓటమితో షాక్‌ తిన్న ఆ జట్టు.. వర్షం కారణంగా ఒత్తిడిలో పడింది. అయితే బలంగా పుంజుకుని జగజ్జేత అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ 20 రోజులు వెనక్కి వెళ్లి ఇంగ్లాండ్‌ ప్రయాణం ఎలా మొదలైంది, ఇప్పుడు విశ్వవిజేతగా ఎలా నిలిచిందో ఓసారి చూద్దాం. 

113 పరుగుల టార్గెట్‌.. ప్రత్యర్థి క్రికెట్‌లో పసి కూన.. అయినా విజయం అంత ఈజీగా రాలేదు. 19వ ఓవర్‌ వరకు పోరాడాల్సి వచ్చింది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్‌ ఈ టోర్నీని ఎలా మొదలుపెట్టిందో. అక్టోబరు 22న అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందినా.. జట్టు స్థాయికి తగ్గ విజయం కాదది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ లివింగ్‌స్టన్‌ (29) నిలబడటంతో ఆ విజయం దక్కింది. శామ్‌ కరన్‌ (5/10) అదిరిపోయే బౌలింగ్‌ ప్రదర్శన లేకుంటే ఆ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేయి జారేదే. 
మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అఫ్గానిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ను కష్టంగా గెలిచిన ఇంగ్లాండ్‌కు రెండో మ్యాచ్‌లో వరుణుడు షాక్‌ ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 157 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో వరుణుడు అడ్డుగా వచ్చాడు. ఇక మ్యాచ్‌ నిర్వహణ అసాధ్యమని తేలడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ లెక్కలు చూశారు. ఆ లెక్కల్లో బట్లర్‌ సేన ఐదు పరుగులు వెనుకబడి ఉంది. ఇంకేముంది ఐర్లాండ్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అనూహ్యంగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లాండ్‌కు ఆ తర్వాతి మ్యాచ్‌లో వరుణుడు మరోసారి షాక్‌ ఇచ్చాడు. అయితే ఈసారి బంతి కూడా పడకుండా.. మ్యాచ్‌ ఆగిపోవడంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. దీంతో సెమీ ఫైనల్‌కి చేరాలంటే తర్వాతి మ్యాచ్‌లు అన్నీ గెలవాల్సి వచ్చింది. అదే సమయంలో రన్‌రేట్‌ మీద కూడా దృష్టి పెట్టాల్సి వచ్చింది. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో మొత్తం ఇంగ్లాండ్‌ జట్టు తిరిగి ఊపు మీదకు వచ్చిందని చెప్పొచ్చు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బట్లర్‌ (73), హేల్స్‌ (52) అదిరిపోయే ఓపెనింగ్‌ ఇచ్చారు. దీంతో 179 పరుగులు చేశారు. తిరిగి సమాధానంగా న్యూజిలాండ్‌ 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు, లోయర్‌ మిడిలార్డర్‌ వైఫల్యంతో ఆ మ్యాచ్‌ కివీస్‌ చేయి జారింది. విలియమ్సన్‌, ఫిలిప్స్‌ కష్టాన్ని ఇంగ్లాండ్‌ బౌలర్లు వృథా చేశారు. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

కివీస్‌ మీద విజయం తర్వాత ఇక ఇంగ్లాండ్‌కు ఎదురు లేదు.. ఇక దూసుకుపోవడమే అనుకునేసరికి శ్రీలంక చిన్నపాటి షాక్‌ ఇచ్చింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆఖరి ఓవర్‌ నాలుగో బంతి వరకు తీసుకొచ్చారు లంక బౌలర్లు. బట్లర్‌ (28), హేల్స్‌ (47), స్టోక్స్‌ (42*) అదరగొట్టినా.. మిడిలార్డర్‌ చేతులెత్తేసింది. అయితే స్టోక్స్‌ ఒత్తిడిని తట్టుకుని జట్టును గెలిపించాడు. అదే సమయంలో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా (7 పాయింట్లు) అతి కష్టం మీద గెలవడంతో రన్‌రేట్‌లో వెనుకబడింది. దీంతో సెమీస్‌ బెర్త్‌ ఇంగ్లాండ్‌ (7 పాయింట్లు) కి దక్కింది. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

శ్రీలంక మీద కష్టంగా గెలిచామనే కసితో ఆడారో ఏమో.. సెమీ ఫైనల్‌లో భారత్‌ మీద ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ అతి కష్టం మీద 168/6 చేస్తే.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు హేల్స్‌ (86*), బట్లర్‌ (80*) ఎంచక్కా ఆడుతూ పాడుతూ కొట్టేశారు. భారత బౌలర్ల భారీ వైఫల్యంతో ఇంగ్లాండ్‌ ఫైనల్‌కి చేరింది. వికెట్‌ నష్టపోకుండా 170 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ ఫైనల్‌ అర్హత సాధించింది. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

సెమీస్‌లో న్యూజిలాండ్‌ మీద భారీ విజయంతో ఫైనల్‌కి వచ్చిన పాక్‌ను ఇంగ్లాండ్‌ బలంగా ఢీకొట్టింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టి పాక్‌ను 137 పరుగులకు కట్టడి చేసింది. ఇక బ్యాటింగ్‌లో కీలక సమయంలో వికెట్లు పడినా, పరుగుల రాక ఆగినా.. బెన్‌ స్టోక్స్‌ (52*) ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని జట్టుకు ప్రపంచకప్‌ అందించాడు. అతనికి బట్లర్‌, బ్రూక్‌, మొయిన్‌ అలీ సాయమందించారు. ఒకానొక దశలో పాక్‌ గెలుస్తుందనిపించినా.. బట్లర్‌ ఆ ఆశను వరుస బౌండరీలతో చిదిమేశాడు. మ్యాచ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అలా కష్టంగా ఈ ఏడాది ప్రపంచకప్‌ ప్రయాణం మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌.. ఇప్పుడు విశ్వవిజేతగా నిలిచింది. చిన్న జట్టు మీద దక్షిణాఫ్రికా ఓటమితో అనూహ్యంగా సెమీస్‌కి చేరి, ఆ తర్వాత ఫైనల్‌కి చేరిన పాకిస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని