వర్షం ఖాతాలో ఇంకో రెండు

టీ20 ప్రపంచకప్‌లో జట్లు, ఆటగాళ్ల కంటే వరుణుడు ఎక్కువ జోరు మీదున్నాడు. టోర్నీలో శుక్రవారం అసలు ఆటే జరగకుండా రెండు మ్యాచ్‌లనూ తుడిచిపెట్టేశాడు.

Published : 29 Oct 2022 01:52 IST

ఆస్ట్రేలియా-  ఇంగ్లాండ్‌ పోరు రద్దు
అఫ్గానిస్థాన్‌-ఐర్లాండ్‌  మ్యాచ్‌ కూడా వర్షార్పణం

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌లో జట్లు, ఆటగాళ్ల కంటే వరుణుడు ఎక్కువ జోరు మీదున్నాడు. టోర్నీలో శుక్రవారం అసలు ఆటే జరగకుండా రెండు మ్యాచ్‌లనూ తుడిచిపెట్టేశాడు. ఎంసీజీలో మొదట అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌.. తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఆడపాదడపా వాన కురుస్తూనే ఉండడంతో టాస్‌ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో సూపర్‌-12లో వర్షార్పణమైన మ్యాచ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. గ్రూప్‌-1లో రెండు మ్యాచ్‌లు జరగకపోవడంతో సెమీస్‌ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ రద్దవడం అభిమానులతో పాటు ఆ జట్లకూ నిరాశ కలిగించేదే. ఇది ఆయా జట్ల సెమీస్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేందుకు ఆస్కారముంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ముందంజ వేయడానికి మెరుగైన అవకాశముండేది. కానీ వరుణుడు నష్టం చేకూర్చాడు. కీలకమైన ఈ మ్యాచ్‌ను చూద్దామని స్టేడియానికి తరలి వచ్చిన 50 వేలకు పైగా ప్రేక్షకులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. టోర్నీలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌, ఇంగ్లాండ్‌ పోరుకే అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కానీ వాన కారణంగా రెండు జట్లూ చెరో పాయింట్‌ పంచుకోక తప్పలేదు. ‘‘మైదానంలో ఇంత తడిగా ఉండడాన్ని మునుపెన్నడూ చూడలేదు. బౌలర్‌ రనప్‌ చేసే ప్రాంతం, వలయం లోపల చాలా తడిగా ఉంది. అన్నింటికంటే ఆటగాళ్ల క్షేమం ముఖ్యం. ఇలాంటి ఉపరితలంపై పరుగులు తీస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. కానీ ఇలా జరగడం నిరాశ కలిగిస్తోంది’’ అని ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ తెలిపాడు. ‘‘ఇదో భారీ సందర్భంగా మిగిలిపోయేది. కెరీర్‌లోనే పెద్ద మ్యాచ్‌ ఇలా ముగియడం నిరాశ కలిగిస్తోంది. తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టి టోర్నీలో అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఇంగ్లాండ్‌ సారథి బట్లర్‌ పేర్కొన్నాడు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ వరుసగా రెండో మ్యాచ్‌నూ ఆడలేకపోయింది. బుధవారం అఫ్గాన్‌, కివీస్‌ మ్యాచ్‌ వర్షార్పణమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని