ఇంగ్లాండ్‌ ఉంది..

ఇంగ్లాండ్‌ నిలిచింది. అత్యంత కీలక పోరులో అదరగొట్టింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది.

Updated : 02 Nov 2022 05:06 IST

సెమీస్‌ ఆశలు సజీవం
బట్లర్‌ మెరుపులతో కివీస్‌పై విజయం
బ్రిస్బేన్‌

ఇంగ్లాండ్‌ నిలిచింది. అత్యంత కీలక పోరులో అదరగొట్టింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. బట్లర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన వేళ టోర్నీలో న్యూజిలాండ్‌కు తొలి పరాజయాన్ని రుచి చూపిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ అవకాశాలను కాపాడుకుంది. కెప్టెన్‌ బట్లర్‌ (73; 47 బంతుల్లో 7×4, 2×6) మెరవడంతో గెలుపు అత్యవసరమైన పోరులో మంగళవారం ఇంగ్లాండ్‌ 20 పరుగుల తేడాతో నెగ్గింది. బట్లర్‌తో పాటు అలెక్స్‌ హేల్స్‌ (52; 40 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో మొదట ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 179 పరుగులు సాధించింది. బట్లర్‌కు ఇది 100వ టీ20 కావడం విశేషం. యువ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (62; 36 బంతుల్లో 4×4, 3×6) సూపర్‌ ఫామ్‌ను కొనసాగించినా ఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. సామ్‌ కరన్‌ (2/26), వోక్స్‌ (2/33), మార్క్‌వుడ్‌ (1/25) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. ఫిలిప్స్‌ కాకుండా విలియమ్సన్‌ (40; 40 బంతుల్లో 3×4) మాత్రమే రాణించాడు. బట్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్‌ గ్రూప్‌-1లో రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌ ఇక తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో శుక్రవారం ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. ఇంగ్లాండ్‌ శనివారం శ్రీలంకతో తలపడుతుంది.

బట్లర్‌ ధనాధన్‌

ఐర్లాండ్‌ చేతిలో అనూహ్య ఓటమి, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ రద్దు ఫలితంగా.. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్లర్‌, హేల్స్‌ ఆ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. మొదట్లో బట్లర్‌ కాస్త తడబడ్డా.. హేల్స్‌ దూకుడుగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. బట్లర్‌ తన తొలి 18 బంతుల్లో 19 పరుగులే చేయగలిగాడు. 11వ ఓవర్లో హేల్స్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 81. అతడు ఔటయ్యాక బట్లర్‌ గేర్‌ మార్చాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫెర్గూసన్‌ ఓవర్లో ఏకంగా మూడు బౌండరీలు కొట్టాడు. మొయిన్‌ అలీ (5) త్వరగానే వెనుదిరిగినా.. బట్లర్‌, లివింగ్‌స్టోన్‌ (20; 14 బంతుల్లో 1×4, 1×6) దూకుడు ఫలితంగా ఇంగ్లాండ్‌ 17 ఓవర్లలో 148/2తో బలమైన స్థితిలో నిలిచింది. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు రాబట్టిన ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్లు చేజార్చుకుంది.

ఫిలిప్స్‌ మెరిసినా..

కివీస్‌ ఛేదన పేలవంగా ఆరభమైంది. ఆ జట్టు 5 ఓవర్లలో ఓపెనర్లు కాన్వే (3), అలెన్‌ (16)లను ఇద్దరినీ కోల్పోయి 28 పరుగులే చేసింది. కానీ ఫామ్‌లో ఉన్న ఫిలిప్స్‌ చెలరేగిపోయాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొయిన్‌ అలీ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మరోవైపు విలియమ్సన్‌ నిలవగా ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 14.4 ఓవర్లలో 119/2తో కివీస్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఇంగ్లాండ్‌ బౌలర్లు పుంజుకున్నారు. విలియమ్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా 91 పరుగుల భాగస్వామ్యాన్ని స్టోక్స్‌ విడదీయడంతో కివీస్‌ పట్టు సడలింది. అక్కడి నుంచి ఆ జట్టు పరుగుల వేటలో వెనుకబడింది. వుడ్‌, వోక్స్‌, సామ్‌ కరన్‌ కట్టడి చేయడంతో కివీస్‌ చివరి అయిదు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులే చేయగలిగింది.. ఫిలిప్స్‌ జోరు కూడా తగ్గింది. అతడు 18వ ఓవర్లో వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌:  బట్లర్‌ రనౌట్‌ 73; హేల్స్‌ (స్టంప్డ్‌) కాన్వే (బి) శాంట్నర్‌ 52; మొయిన్‌ (సి) బౌల్ట్‌ (బి) సోధి 5; లివింగ్‌స్టోన్‌ (బి) ఫెర్గూసన్‌ 20; బ్రూక్‌ (సి) అలెన్‌ (బి) సౌథీ 7; స్టోక్స్‌ ఎల్బీ (బి) ఫెర్గూసన్‌ 8; సామ్‌ కరన్‌ నాటౌట్‌ 6; మలన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-81, 2-108, 3-153, 4-160, 5-162, 6-176
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-40-0; సౌథీ 4-0-43-1; శాంట్నర్‌ 4-0-25-1; ఫెర్గూసన్‌ 4-0-45-2; సోధి 4-0-23-1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) స్టోక్స్‌ (బి) సామ్‌ కరన్‌ 16; కాన్వే (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 3; విలియమ్సన్‌ (సి) రషీద్‌ (బి) స్టోక్స్‌ 40; గ్లెన్‌ ఫిలిప్స్‌ (సి) జోర్డాన్‌ (బి) సామ్‌ కరన్‌ 62; నీషమ్‌ (సి) సామ్‌ కరన్‌ (బి) వుడ్‌ 6; డరిల్‌ మిచెల్‌ (సి) జోర్డాన్‌ (బి) వోక్స్‌ 3; శాంట్నర్‌ నాటౌట్‌ 16; ఇష్‌ సోధి నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-8, 2-28, 3-119, 4-126, 5-131, 6-135; బౌలింగ్‌: మొయిన్‌ అలీ 1-0-4-0; వోక్స్‌ 4-0-33-2; అదిల్‌ రషీద్‌ 4-0-33-0; సామ్‌ కరన్‌ 4-0-26-2; మార్క్‌ వుడ్‌ 3-0-25-1; లివింగ్‌స్టోన్‌ 3-0-26-0; బెన్‌ స్టోక్స్‌ 1-0-10-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని