Team India: పాక్‌ను ఒత్తిడికి గురిచేసి.. ఉచ్చులోకి లాగిందిలా..!

ఈ ప్రపంచకప్‌లోనే (ODI World Cup 2023) భారత్ వద్ద అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్‌ దళం ఉందని పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలిసిపోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ పాక్‌ను ఒత్తిడికి గురి చేసి కుప్పకూల్చడానికి ఓ పదునైన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆ దెబ్బకు పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది.

Updated : 15 Oct 2023 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ వ్యూహం.. ఓ ఎదురు దాడి.. ఓ మైండ్‌గేమ్‌.. ముందు చూపు.. ఎక్కడా ప్రయత్నాలను వదలని పట్టుదల.. అన్నింటికీ మించి సమష్టి కృషి..!.. టీమ్‌ ఇండియా (Team India) ప్రత్యర్థులను వీటితోనే ఇప్పుడు భయపెడుతోంది. తాజాగా పాక్ (pakistan) మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఛాంపియన్‌లా ఏ విభాగంలోనూ పాక్‌(pakistan)కు అవకాశం ఇవ్వలేదు. ఇక మన బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే..

మ్యాచ్‌ ముందు నుంచే మైండ్‌గేమ్‌..

పాక్‌(pakistan)తో మ్యాచ్‌లో టాస్‌ నుంచే రోహిత్‌ (rohit sharma) ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ.. ప్రత్యర్థిలో సందేహాలు రేకెత్తించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టాస్‌ గెలిచినా.. బౌలింగ్‌ను ఎంచుకొన్నాడు. ఒకవేళ కొండంత లక్ష్యం ఎదురుగా పెట్టినా.. తమ బ్యాటింగ్‌ లైనప్‌ దానిని పిండిచేస్తుందనే సందేశం పాక్‌కు పంపాడు. అంతేకాదు.. తమ బౌలర్లు పాక్‌ను తక్కువకే కట్టడి చేస్తారన్న విశ్వాసం కనబర్చాడు. ఇన్నింగ్స్‌ మొదలై పాక్‌ బ్యాటర్లు రెండు ఓవర్ల పాటు సిరాజ్‌పై ఎదురు దాడి చేసినా.. పవర్‌ ప్లేలో అతడి రికార్డును దృష్టిలోపెట్టుకొని అతడితోనే బౌలింగ్‌ను కొనసాగించాడు. హైదరబాదీ మియా భాయ్‌ కూడా కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ముచేయకుండా షఫీక్‌ రూపంలో తొలి వికెట్‌ను అందించాడు.

అటు కాకపోతే.. ఇటు నుంచి నరుక్కొచ్చి..

వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రత్యర్థి రన్‌రేట్‌ను కట్టడి చేయడం చాలా ముఖ్యం. వికెట్లు లభించడమనేది బోనస్‌ లాంటిది. భారత్‌ దీనిని బాగా వంటపట్టించుకుంది. ఓపెనర్‌ ఇమామ్‌ వికెట్‌ను కోల్పోయిన తర్వాత పాక్‌ బ్యాటింగ్‌ మూలస్తంభాలైన బాబర్‌-రిజ్వాన్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డారు. రిజ్వాన్‌ ఈ టోర్నిలో సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రోహిత్‌ తెలివిగా బౌలింగ్‌ వనరులు వినియోగించాడు. పాండ్యా, జడేజా, కుల్దీప్‌లను మార్చిమార్చి బౌలింగ్‌ చేయించాడు. ఫలితంగా పవర్‌ ప్లే తర్వాత పాక్‌ జట్టు ఒక ఓవర్‌లో పది పరుగులు రాబట్టిన సందర్భాలు కేవలం మూడే ఉన్నాయి. ఇక 20వ ఓవర్‌ వచ్చేసరికి పాక్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి రన్‌రేట్‌ పడిపోయింది. 20-42వ ఓవర్‌ మధ్యలో కేవలం 8 సార్లు మాత్రమే ఓవరకు ఐదు అంత కంటే ఎక్కువ పరుగులు చేశారు. ముఖ్యంగా జడేజా, కుల్దీప్ వేసిన 23-28 ఓవర్ల మధ్య స్పెల్‌లో పాక్‌ ఏ ఓవర్‌లోనూ 5 పరుగులు చేయలేదు. ఈ క్రమంలో తొలి స్పెల్‌లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్‌ మళ్లీ బౌలింగ్‌కు రావడంతో.. పరుగులు రాక ఒత్తిడిలో ఉన్న పాక్‌ బ్యాటర్లు అతడిపై ఎదురు దాడికి యత్నించారు. ఈ క్రమంలో బాబర్ వికెట్‌ను తీసి మరోసారి భారత్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు సిరాజ్‌. అంతే.. వికెట్ల కోసం ఎనిమిది ఓవర్లు వేచి ఉన్న కుల్దీప్‌ తన ఎనిమిదో ఓవర్‌లో సౌద్‌, రిజ్వాన్‌ వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలిపోయింది. వికెట్లు లభించకపోతే.. పరుగులు కట్టడి చేస్తే ఫలితం లభిస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని భారత్‌ అద్భుతంగా అమలు చేసింది.  ఈ ప్రపంచకప్‌లో అత్యంత పొదుపరి టాప్‌-5 బౌలర్లలో నలుగురు భారతీయులే ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్‌ (3.40) బుమ్రా(3.44), జడేజా (3.73), కుల్దీప్‌ (3.90) ఉన్నారు.  వీరిలో అశ్విన్‌ ఈ మ్యాచ్‌ ఆడలేదు. టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక డాట్‌బాల్స్ వేసింది బుమ్రా (115)నే. ఇక జడేజా (95) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జోడీ మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టింది.

పట్టారు భరతం.. ఊగింది భారతం

కుల్దీప్‌ బౌలింగ్‌లో చేసుకొన్న చిన్న మార్పులు అతడిని ప్రమాదకరంగా మర్చేశాయి. 2017తో పోలిస్తే.. ప్రస్తుతం అతడు బంతిని తక్కువగా టర్న్‌, బౌన్స్‌ చేస్తున్నాడు. అదే సమయంలో స్టంప్స్‌ను గురిపెడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న చిన్న ట్రిక్స్‌తో వికెట్లను సాధిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో బాబర్‌-రిజ్వాన్‌ జోడీ అతడిని ఎదుర్కోవడానికి అవస్థలు పడింది. ఆ ఒత్తిడే.. వారు వికెట్లు సమర్పించుకొనేలా చేసింది.

పాక్‌ను కాదు.. టోర్నీని దృష్టిలోపెట్టుకొని బ్యాటింగ్‌..

50 ఓవర్లకు 192 అనేది చాలా చిన్న లక్ష్యం.. కానీ, అక్కడున్నది పాక్‌ సీమర్లు. షహీన్‌, హారిస్‌లతో కూడిన అత్యంత ప్రమాదకరమైన పేస్‌ దళం. కానీ, తొలి బంతి నుంచే పాక్‌ బౌలర్లపై రోహిత్‌ ఎదురుదాడి మొదలుపెట్టాడు. ముఖ్యంగా షహీన్‌, హారిస్‌లను లక్ష్యాంగా చేసుకున్నాడు. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నాయి. ఏదైనా జరిగి పాయింట్లు సమమైతే.. నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఈ అంశాన్ని కూడా కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ మనసులో పెట్టుకొన్నాడు. గిల్‌, కోహ్లీ వికెట్లు పడినా సరే.. ఎక్కడా పరుగుల వేగానికి బ్రేకులు వేయలేదు. నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో కూడ రోహిత్‌ ఇదే శైలిలో ఆడాడు. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌నూ భారత్‌ సీరియస్‌గా తీసుకుంటోదనడానికి ఇదే ఉదాహరణ.

ఇక భారత్‌ మిడిలార్డర్‌ కూడా ఇప్పటి వరకు టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచి అత్యంత బాధ్యతా యుతంగా ఆడుతూ వస్తోంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. జట్టును గట్టెక్కించింది. తాజాగా గిల్‌, విరాట్‌ వంటి టాప్‌ ఆర్డర్ ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో ఔటైనా.. అయ్యర్‌, రాహుల్‌ ఎటువంటి లోపాలకు చోటివ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఛేజింగ్‌ చేయడం సహజంగానే బ్యాటర్లపై తెలియని ఒత్తిడిని పెంచుతుంది.. కానీ, ఈ టోర్నీలో ఆసీస్‌, పాక్‌ వంటి బలమైన జట్లను ఛేజింగ్‌లోనే ఓడించడం టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని