IND vs PAK: పట్టారు భరతం.. ఊగింది భారతం

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ నుంచి హాట్‌ ఫేవరెట్‌గా మారింది భారత్‌. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ప్రపంచకప్‌లో మిగతా ప్రత్యర్థులకూ హెచ్చరికలు పంపింది.

Updated : 15 Oct 2023 08:16 IST

రెచ్చిపోయిన రోహిత్‌ సేన

7 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తు

ఇదేం ఆట..? మరీ ఇంత దారుణమా..? ఇలా కుప్పకూలిపోవడమా..?

పాకిస్థాన్‌ ఆట చూసి ఆ దేశ అభిమానులే కాదు, మనవాళ్లు కూడా కొంచెం నిట్టూర్చి ఉంటే ఆశ్చర్యం లేదు!

ఎందుకంటే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే అంతిమంగా భారతే గెలవాలనుకుంటాం కానీ.. ప్రత్యర్థి నుంచి పోటీయే లేకుంటే..? మ్యాచ్‌లో ఉత్కంఠే లేకుంటే..? మన జట్టు అలవోకగా గెలిచేస్తే..? శనివారం అదే జరిగింది.

అంచనాలకు ఏమాత్రం తగ్గని రోహిత్‌ సేన తనదైన శైలిలో రెచ్చిపోయింది. 

బౌలింగ్‌ అసాధారణం.. ఫీల్డింగ్‌ అమోఘం.. బ్యాటింగ్‌ అద్భుతం.. మొత్తంగా మన జట్టు ఆట టాప్‌ క్లాస్‌!

కానీ ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆరంభించి.. ఒక దశ వరకు దీటుగా బదులిచ్చి.. భారత్‌కు సవాలు విసిరేలా కనిపించిన పాకిస్థాన్‌.. మధ్యలో కాడి వదిలేసింది. ఉన్నట్లుండి కుప్పకూలి మ్యాచ్‌ను పువ్వుల్లో పెట్టి భారత్‌కు అప్పగించేసింది. టగ్‌ ఆఫ్‌ వార్‌లో చిన్న అవకాశం లభించగానే అవతలి జట్టును లాగి పడేసినట్లుగా.. ప్రత్యర్థి పట్టు కొంచెం సడలడం ఆలస్యం, రోహిత్‌ సేన ఏకబిగిన దాడి చేసి మ్యాచ్‌ను లాగి పడేసింది.

కాలం మారినా.. వేదిక మారినా.. ఆటగాళ్లు మారినా.. ఆధిపత్యం మాత్రం మనదే. ఫలితమూ అదే!

చరిత్ర చెరిగిపోలేదు. ప్రపంచకప్‌లో పాక్‌పై అజేయ రికార్డు పదిలం. కొత్త లెక్క.. 8-0.

అహ్మదాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ నుంచి హాట్‌ ఫేవరెట్‌గా మారింది భారత్‌. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ప్రపంచకప్‌లో మిగతా ప్రత్యర్థులకూ హెచ్చరికలు పంపింది. మొదట సిరాజ్‌ (2/50), కుల్‌దీప్‌ (2/38), బుమ్రా (2/19), హార్దిక్‌ (2/34), జడేజా (2/38).. ఇలా ప్రధాన బౌలర్లందరూ అదరగొట్టడంతో పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. బాబర్‌ అజామ్‌ (50; 58 బంతుల్లో 7×4), మహమ్మద్‌ రిజ్వాన్‌ (49; 69 బంతుల్లో 7×4), ఇమాముల్‌ హక్‌ (36; 38 బంతుల్లో 6×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అద్భుత కెప్టెన్సీతో పాక్‌ పతనంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ శర్మ.. అనంతరం బ్యాటింగ్‌లోనూ జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్‌ (86; 63 బంతుల్లో 6×4, 6×6)తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3×4, 2×6) కూడా సత్తా చాటడంతో లక్ష్యాన్ని భారత్‌ కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నీలో భారత్‌కిది హ్యాట్రిక్‌ గెలుపు. భారీ విజయంతో నెట్‌రన్‌రేట్‌ను కూడా బాగా మెరుగుపరుచుకున్న రోహిత్‌ సేన.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్‌ గురువారం పుణెలో తన తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.

కెప్టెన్‌ ధనాధన్‌..

చెన్నైలో ఆసీస్‌పై రెండొందల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. 2 పరుగులకే 3 వికెట్లు పడటంతో చిన్న లక్ష్యం కూడా కొండలా మారిపోయింది. పాక్‌కు బలమైన పేస్‌ బౌలింగ్‌ దళం ఉండటంతో అలాంటి ప్రమాదమేమైనా ముంచుకొస్తుందేమో అన్న సందేహం అభిమానుల్లో ఏ మూలో ఉండగా.. ఛేదనను మొదలుపెట్టింది భారత్‌. అయితే జ్వరం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌ ఆడిన శుభ్‌మన్‌.. చకచకా నాలుగు ఫోర్లు కొట్టి జట్టు ఒత్తిడిలో పడకుండా చూశాడు. కానీ అదే ఊపులో షహీన్‌ బౌలింగ్‌లో ఓ షాట్‌ ఆడబోయి పాయింట్‌లో షాదాబ్‌ మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో భారత్‌ ఆత్మరక్షణలో పడుతుందేమో అనిపించింది. కానీ అఫ్గాన్‌పై మెరుపు సెంచరీతో లయ అందుకున్న కెప్టెన్‌ రోహిత్‌.. పాక్‌ బౌలర్లకు అవకాశమే ఇవ్వలేదు. తాను ఊపులో ఉంటే ఎంత ప్రమాదమో చూపిస్తూ అతను పాక్‌ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. లక్ష మందికి పైగా భారత అభిమానులతో నిండిపోయిన స్టేడియాన్ని ఉర్రూతలూగిస్తూ అతను అద్భుతమైన షాట్లు ఆడాడు. హసన్‌ అలీ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో జోరందుకున్న అతను.. ప్రమాదకరంగా కనిపిస్తున్న షహీన్‌ బౌలింగ్‌లో ఏడో ఓవర్లో తన ట్రేడ్‌ మార్కు పుల్‌ షాట్‌తో సిక్సర్‌ బాదడంతో టాప్‌ గేర్‌లోకి వచ్చేశాడు. అక్కడ్నుంచి పూర్తిగా భారత్‌దే పైచేయి. స్పిన్నర్‌ నవాజ్‌కు సిక్స్‌ రుచి చూపిన హిట్‌మ్యాన్‌.. వేగంతో భయపెట్టే రవూఫ్‌కు రెండు సిక్సర్లు బహుమతిగా ఇచ్చాడు. మరో ఎండ్‌లో కోహ్లి క్రీజులో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు కానీ.. ఒక పేలవ షాట్‌ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించింది. అయినా భారత్‌కు ఇబ్బంది లేకపోయింది. శ్రేయస్‌ సహకారంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు రోహిత్‌. శ్రేయస్‌ కూడా అడపాదడపా చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన రోహిత్‌.. జోరు కొనసాగిస్తూ శతకం వైపు అడుగులేశాడు. 21 ఓవర్లకు 154/2తో భారత్‌ తిరుగులేని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో రోహిత్‌ ఆడిన ఓ షాట్‌ గురి తప్పి.. పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. తర్వాత రాహుల్‌తో కలిసి శ్రేయస్‌ పని పూర్తి చేశాడు. 31వ ఓవర్లో నవాజ్‌ బంతిని అతడి  తలమీదుగా బౌండరీకి తరలించడంతో భారత్‌ విజయమే కాదు, శ్రేయస్‌ అర్ధశతకమూ పూర్తయింది.

పటిష్ఠ స్థితి నుంచి పతనం

ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు మొదటే బ్యాటింగ్‌ చేసింది భారత్‌. ఒక్క 2003లో మాత్రమే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇటీవల పాక్‌ ఛేదనలో మెరుగుపడటం, అహ్మదాబాద్‌లో మంచు ప్రభావం వల్ల రాత్రి పూట బౌలింగ్‌ చేయడం కష్టమవుతుందన్న అంచనాల నేపథ్యంలో టాస్‌ నెగ్గిన రోహిత్‌.. బౌలింగ్‌కే మొగ్గు చూపాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ సగం వరకు సాగిన తీరు చూస్తే.. రోహిత్‌ నిర్ణయం తప్పా అన్న సందేహాలు కలిగాయి. భారత్‌ 270-300 మధ్య లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి వస్తుందనిపించింది. కానీ ఇన్నింగ్స్‌ మధ్యలో మ్యాచ్‌ అనూహ్యమైన మలుపు తిరిగింది. 155/2 నుంచి ఒక్కసారిగా పతనమైన పాక్‌.. కేవలం 191 పరుగులకే ఆలౌటవడంతో ఫలితం ముందే ఖరారైపోయింది. భారత్‌కు తొలి వికెట్‌ అందించడమే కాక, పాక్‌ పటిష్ఠ స్థితిలో ఉండగా బాబర్‌ వికెట్‌ను పడగొట్టిన సిరాజ్‌.. ఆ జట్టు పతనంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. బుమ్రాను ఆడటం పాక్‌ బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. మిగతా బౌలర్లూ తమ వంతు బాధ్యత నెరవేర్చడం.. బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ ఏర్పాట్లతో రోహిత్‌ తనదైన ముద్ర వేయడంతో పాక్‌కు పుంజుకునే అవకాశమే లేకపోయింది.

80 బంతుల్లో..

పాక్‌ ఇన్నింగ్స్‌ మొదలైన తీరు, సగం వరకు సాగిన తీరు చూస్తే మ్యాచ్‌ ఇంత ఏకపక్షం అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. షఫీక్‌ (20)తో కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించిన ఇమాముల్‌.. తర్వాత కూడా దూకుడు కొనసాగించడంతో పాక్‌ ఇన్నింగ్స్‌కు బలమైన పునాదే పడింది. ఇమాముల్‌ జోరుకు హార్దిక్‌ కళ్లెం వేసినా.. పాక్‌ జట్టులో టాప్‌-2 బ్యాటర్లయిన బాబర్, రిజ్వాన్‌ నిలకడగా ఆడి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. స్పిన్నర్లను పాక్‌ జోడీ సునాయాసంగా ఆడేస్తుండటంతో రోహిత్‌.. సిరాజ్‌ను తీసుకొచ్చాడు. తొలి స్పెల్‌ తొలి 2 ఓవర్లలో 20 పరుగులిచ్చినప్పటికీ, తర్వాత పుంజుకుని షఫీక్‌ను ఔట్‌ చేసిన సిరాజ్‌.. రెండో స్పెల్‌లోనూ ఇలాగే పాక్‌ను దెబ్బ కొట్టాడు. ముందు ఓవర్లో 13 పరుగులు ఇచ్చిన సిరాజ్‌ను బాబర్‌ కొంచెం తేలిగ్గా తీసుకున్నాడు. అతడి బంతిని థర్డ్‌ మ్యాన్‌లో ఆడబోగా.. ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయింది. ఈ వికెట్‌తో ఒక్కసారిగా పాక్‌ ఇన్నింగ్స్‌ తలకిందులైంది. కుల్‌దీప్‌ ఒకే ఓవర్లో సాద్‌ షకీల్‌ (6), ఇఫ్తికార్‌ (4)లను ఔట్‌ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. వెంటనే బుమ్రాను రంగంలోకి దించిన రోహిత్‌.. క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌కు చెక్‌ పెట్టాడు.  షాదాబ్‌ (2)ను సైతం బుమ్రానే బౌల్డ్‌ చేశాడు. నవాజ్‌ (4) కూడా పాక్‌ను రక్షించలేకపోయాడు. జడేజా ఒకే ఓవర్లో హసన్‌ అలీ (12), రవూఫ్‌ (2)లను ఔట్‌ చేసి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. పాక్‌ 80 బంతులు, 36 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం.


మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. ఇది 190 పరుగుల పిచ్‌ కాదు. ఓ దశలో వాళ్లు 280 పరుగులు చేసేలా కనిపించారు. బౌలింగ్‌ చేసిన మా ప్రతి బౌలరూ రాణించాడు.

- రోహిత్‌ శర్మ


మా ఆరంభం బాగానే ఉంది. మామూలుగా ఆడి భాగస్వామ్యాలు నిర్మించాలన్నది మా ప్రణాళిక. మా ఆరంభం ప్రకారం చూస్తే.. మేం 280-290 పరుగులు చేయాలి. కానీ కుప్పకూలడం మమ్మల్ని దెబ్బ తీసింది’’

- బాబర్‌ 


8

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయాలు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టీమ్‌ఇండియా ఓడిపోలేదు. 


11

వన్డే ప్రపంచకప్‌ల్లో రోహిత్‌ 50కి పైగా పరుగులు చేసిన సందర్భాలు. 


1

కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ ప్రపంచకప్‌లో తొలి అర్ధసెంచరీ నమోదు చేశాడు. 


303

వన్డేల్లో రోహిత్‌సిక్సర్లు. పాక్‌తో మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. వన్డేల్లో 300కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా అఫ్రిది (351), గేల్‌ (331) తర్వాత రోహిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 


117

పాక్‌పై భారత విజయంలో మిగిలిన బంతులు. బంతుల పరంగా వన్డేల్లో పాక్‌పై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. 


14.2

పాకిస్థాన్‌పై కుల్‌దీప్‌ సగటు. వన్డేల్లో కనీసం 10 వికెట్లు తీసిన భారత బౌలర్లలో అతనిదే ఉత్తమం.


157

వన్డేల్లో కుల్‌దీప్‌ వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్‌గా హాగ్‌ (156)ను అధిగమించాడు.


పాటలతో మొదలు కానీ..

బీసీసీఐ చెప్పినట్లుగానే ఈ మ్యాచ్‌కు ముందు సంగీత కార్యక్రమం నిర్వహించారు. శంకర్‌ మహదేవన్‌, సునిధి చౌహాన్‌, అర్జిత్‌ సింగ్‌, సుఖ్‌విందర్‌ సింగ్‌ తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం నిరాశ కలిగించింది. కేవలం స్టేడియంలోని ప్రేక్షకుల కోసం ఈ సంగీత కార్యక్రమం అని ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌ ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది.


సచిన్‌ సందడి..

ఐసీసీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సచిన్‌ తెందుల్కర్‌ ఈ మ్యాచ్‌లో సందడి చేశాడు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ప్రపంచకప్‌ తీసుకొచ్చి మైదానం మధ్యలో పెట్టాడు. అప్పుడు ప్రేక్షకుల కేరింతలు మిన్నంటాయి. అనంతరం విరాట్‌ కోహ్లీతో సచిన్‌ మాట్లాడుతూ కనిపించాడు. మ్యాచ్‌ మధ్యలో సచిన్‌ వ్యాఖ్యాతగానూ మారిపోయాడు. మ్యాచ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హాజరయ్యారు.


పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: షఫీక్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 20; ఇమాముల్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 36; బాబర్‌ (బి) సిరాజ్‌ 50; రిజ్వాన్‌ (బి) బుమ్రా 49; సాద్‌ షకీల్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 6; ఇఫ్తికార్‌ (బి) కుల్‌దీప్‌ 4; షాదాబ్‌ (బి) బుమ్రా 2; నవాజ్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 4; హసన్‌ అలీ (సి) శుభ్‌మన్‌ (బి) జడేజా 12; షహీన్‌ అఫ్రిది నాటౌట్‌ 2; రవూఫ్‌ ఎల్బీ (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (42.5 ఓవర్లలో ఆలౌట్‌) 191; వికెట్ల పతనం: 1-41, 2-73, 3-155, 4-162, 5-166, 6-168, 7-171, 8-187, 9-187; బౌలింగ్‌: బుమ్రా 7-1-19-2; సిరాజ్‌ 8-0-50-2; హార్దిక్‌ 6-0-34-2; కుల్‌దీప్‌ 10-0-35-2; జడేజా 9.5-0-38-2; శార్దూల్‌ 2-0-12-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) షహీన్‌ 86; శుభ్‌మన్‌ (సి) షాదాబ్‌ (బి) షహీన్‌ 16; కోహ్లి (సి) నవాజ్‌ (బి) హసన్‌ అలీ 16; శ్రేయస్‌ నాటౌట్‌ 53; రాహుల్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192; వికెట్ల పతనం: 1-23, 2-79, 3-156; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 6-0-36-2; హసన్‌ అలీ 6-0-34-1; నవాజ్‌ 8.3-0-47-0; రవూఫ్‌ 6-0-43-0; షాదాబ్‌ 4-0-31-0

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని