Jasprit Bumrah: నేను జట్టులోకి ఇక తిరిగి రాలేనని అన్నారు: బుమ్రా

ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) అద్భుతంగా రాణిస్తున్నాడు. 

Published : 31 Oct 2023 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి తమకు తిరుగులేదని రోహిత్‌సేన మరోసారి చాటింది. ఇంగ్లాండ్‌పై ఘన విజయంతో టీమ్‌ఇండియా(Team India) సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇక నిప్పులు చెరిగే బంతులతో భారత బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడి ఇంగ్లాండ్‌(IND vs ENG)పై విజయాన్ని అందించారు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ మొత్తం 14 వికెట్లతో.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే.. గాయం కారణంగా బుమ్రా ఈ ప్రపంచకప్‌ ముందు చాలా కాలం జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇక తన కెరీర్‌ ముగిసినట్లేనని పలువురు అన్నట్లు బుమ్రా చెప్పాడు. ‘నా భార్య స్పోర్ట్స్‌ మీడియాలో పనిచేస్తోంది. అందువల్ల.. నా కెరీర్‌పై వ్యక్తమైన అనేక అనుమానాలు నాకు తెలిశాయి. నేను ఇక తిరిగి జట్టులోకి రాలేనేమోనని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే వాటిని నేను పట్టించుకోలేదు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. తిరిగి వచ్చాను. ఆటను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసుకున్నాను. నేను దేని కోసం వెంటపడలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు నాకు జట్టులో మంచి అవకాశాలు లభించాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాను’ అని బుమ్రా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. 

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక టీమ్‌ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో నవంబర్‌ 2న తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని