Jemimah Rodrigues: ఈ టోర్నీ మొత్తంలో ఏడవని రోజు లేదు.. మ్యాచ్‌ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న జెమీమా

Eenadu icon
By Sports News Team Updated : 31 Oct 2025 10:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ప్రపంచకప్‌లో జైత్రయాత్ర సాగించిన ఆస్ట్రేలియాను సెమీస్‌లో భారత జట్టు కంగుతినిపించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 9 బంతులుండగానే హర్మన్‌ప్రీత్‌ సేన ఛేదించింది. సొంతగడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) సంచలనం సృష్టించింది. అజేయ శతకంతో (127: 134 బంతుల్లో 14 ఫోర్లు) మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. అసాధారణ లక్ష్యం ముందున్నా క్రీజులో బెరుకులేకుండా పాతుకపోయింది. హర్మన్‌ ప్రీత్‌ (89: 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జెమీమా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ల సహకారంతో భారత్‌ను విజయతీరాలవైపు నడిపించింది. 

మ్యాచ్‌ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన రోడ్రిగ్స్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘దేవుడి దయ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ దేవుడికి ధన్యవాదాలు. అమ్మ, నాన్న, కోచ్‌, నా ఆత్మీయులు నన్ను ఎంతో నమ్మారు. గత నెల చాలా కష్టంగా గడిచింది. కానీ, ఇప్పుడిది కలలా ఉంది. నమ్మలేకపోతున్నా. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని ముందు నాకు తెలియదు. కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు. నా కోసం పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని అనుకోలేదు. ఇటీవల కీలక మ్యాచ్‌ల్లో టీమ్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించి ఫైనల్‌కు తీసుకెళ్లాలనుకున్నా. అర్ధశతకం, శతకం గురించి ఆలోచించలేదు. కానీ కచ్చితంగా పెద్దస్కోర్‌ చేసి భారత్‌ను గెలిపించాలనుకున్నా. 

మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ గత ప్రపంచకప్‌లో నాకు చోటు దక్కలేదు. కొన్ని విషయాలు మన పరిధిలో లేకుండానే వెంటవెంటనే జరుగుతుంటాయి. ఈ క్షణం కోసమే అలా జరిగి ఉంటుందనుకుంటా. ఈ టోర్నీలో నేను ఏడవని రోజు లేదు. మానసికంగా సరిగ్గా లేను. తీవ్రమైన ఆందోళనతో ఉన్నా. నేను మంచి ప్రదర్శన చేయాలని నాలోనే నేను అనుకునేదాన్ని. జట్టు కోసం నిలబడాలనుకున్నాను. అయితే మిగిలినదంతా దేవుడే చూసుకున్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉన్నా.. చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలనుకున్నాను. భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. హర్మన్‌ప్రీత్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాను. మ్యాచ్‌ ముగుస్తున్నకొద్దీ నేను మరింత దూకుడుగా ఆడాలనుకున్నాను కానీ ఆడలేకపోయాను. బంతి బంతికి దీప్తి నన్ను ఎంతో ప్రోత్సహించింది. జట్టు సభ్యులు అండగా ఉన్నారు. భారత్‌ గెలవడం పట్ల నేను క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదు. మ్యాచ్‌ను నేను ఒక్కదాన్నే గెలిపించలేదు. మైదానంలో అభిమానుల ప్రోత్సాహం నన్ను ఎంతో ఉత్సాహపరిచింది’’ అని జెమీమా అంది.   

ఈ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో రెండుసార్లు డకౌట్‌ అయిన జెమీమా.. మరో రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో జట్టు కూర్పులో భాగంగా ఏకంగా ఆమెను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన కీలక పోరులో మళ్లీ జట్టులోకి వచ్చిన రోడ్రిగ్స్‌ 55 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక సెమీస్‌లో భారీ శతకంతో తన సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది.

Tags :
Published : 31 Oct 2025 01:40 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు