
IPL 2021: RCB vs CSK ప్రివ్యూ.. ధీమాతో చెన్నై.. ఆశతో బెంగళూరు
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్‌లోని రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇప్పటికే సోమవారం కోల్‌కతాతో చావుదెబ్బ తిన్న ఆ జట్టు ఈరోజు ఎలాగైనా చెన్నైని ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో ముందుకు రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు చెన్నై ముంబయితో తలపడిన సందర్భంగా అనూహ్య విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.
కోహ్లీ, డివిలియర్స్, మాక్సీ చెలరేగాలి..
కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు 92 పరుగులకే కుప్పకూలి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్‌తో సహా తర్వాత వచ్చే ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి కీలక ఆటగాళ్లు పూర్తిగా తేలిపోయారు. తొలి భాగంలో అదరగొట్టిన వీరంతా ఇకపై జట్టు ముందుకు సాగాలంటే బ్యాట్లకు పనిచెప్పక తప్పదు. మరోవైపు శ్రీకర్ భరత్, సచిన్ బేబీ లాంటి యువ బ్యాట్స్‌మెన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ను వీళ్లంతా మర్చిపోవాలి. సిరాజ్, హర్షల్ పటేల్ కాస్త ఫర్వాలేదనిపించినా మిగతా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కైల్ జేమీసన్, యుజువేంద్ర చాహల్, వానిండు హసరంగా పదికిపైగా ఎకానమీతో చతికిల పడ్డారు.
రైనా, డుప్లెసిస్, మొయిన్ అలీ దంచికొట్టాలి..
మరోవైపు టాప్‌లో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ది మరో పరిస్థితి. ముంబయితో ఆడిన గత మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(88) పుణ్యమా అని గెలిచింది. లేదంటే బెంగళూరు పరిస్థితే ఎదురయ్యేది. తొలి సీజన్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన డుప్లెసిస్, ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ధోనీ, సురేశ్ రైనా లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే జడేజా, బ్రావోతో కలిసి రుతురాజ్ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అనంతరం దీపక్ చాహర్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ముంబయిని 136 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ జట్టు టాప్‌లోకి వెళ్లింది. కాగా, ఈరోజు బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లోనూ చెన్నై బౌలర్లు ఇలాగే చెలరేగితే కోహ్లీసేనకు కష్టాలు తప్పకపోవచ్చు.
ఏదేమైనా రెండు జట్లలోని ప్రధాన బ్యాట్స్‌మెన్ రాణించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆడకపోయినా ఆ జట్టు కష్టాల్లో పడే అవకాశమూ లేకపోలేదు. కాగా, చెన్నై ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుండగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు బెంగళూరు ఈరోజు గెలుపొంది తొలి సీజన్ మాదిరే ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది.
జట్ల అంచనా:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, సచిన్ బేబీ, భరత్, వానిండు హసరంగ, యుజువేంద్ర చాహల్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, సిరాజ్
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ధోనీ (కెప్టెన్) శార్దూల్ ఠాకూర్, హేజిల్‌వుడ్, దీపక్ చాహర్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.