Rohit - Virat: రోహిత్ - కోహ్లీ ఎక్కడికీ వెళ్లరు: రిటైర్మెంట్‌ వార్తలపై అరుణ్‌ ధుమాల్‌

Eenadu icon
By Sports News Team Published : 01 Nov 2025 11:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెరిశారు. రోహిత్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేయగా.. విరాట్ కూడా ఒక అర్ధశతకం నమోదు చేశాడు. మళ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ వరకూ ఆ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడరు. ఎందుకంటే కేవలం వీరు వన్డేల్లోనే ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకూ కెరీర్‌ను కొనసాగించాలనేది వారి అభిమతం కాగా.. అభిమానుల ఆకాంక్ష కూడా ఇదే. కానీ, మేనేజ్‌మెంట్ మాత్రం వారికి అవకాశాలు ఇస్తుందా? అనేది ఇప్పుడందరిలోనూ నెలకొన్న సందేహం. ఈ క్రమంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్‌ దృష్టికి రోహిత్ - విరాట్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న వచ్చింది.

‘‘చాన్నాళ్లుగా భారత రిజర్వ్‌ బెంచ్‌ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడీ టీమ్‌ఇండియాను చూడండి.. ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ తన ప్లేస్‌ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు చాలామంది రోహిత్, విరాట్ (Virat Kohli) వెళ్లిపోతారంటూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ, వారెక్కడికీ వెళ్లరు. ఇక్కడే ఉంటారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్‌ (Rohit Sharma) ఆటను చూశాం కదా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. భారత్‌కు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడరు. వారి జీవితం భారత క్రికెట్‌కు అందించారు’’ అని అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు.

వచ్చే నెలలో మినీ వేలం!

ఐపీఎల్‌ 2026 (IPL) సీజన్‌కు సంబంధించి మినీ వేలం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిపై ఇప్పటి వరకు అధికారికంగా బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత రెండు పర్యాయాలు విదేశాల్లోనే వేలం జరిగిన సంగతి తెలిసిందే. 2023లో దుబాయ్‌, 2024లో సౌదీ అరేబియా వేదికగా వేలం నిర్వహించారు. ఇప్పుడు స్వదేశంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 13-15 తేదీల్లో జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్‌ లిస్ట్‌తోపాటు వదిలేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసే పనిలో ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు