పసిపిల్లలు చనిపోతున్నారు.. మౌనమెందుకు?: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణపై ఇర్ఫాన్‌ పఠాన్‌

Israel Hamas Conflict: హమాస్‌ను మట్టుపెట్టే లక్ష్యంతో గాజా నగరంపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇది పౌరుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ మానవ సంక్షోభంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌(Irfan Pathan) స్పందించారు.

Updated : 03 Nov 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel Hamas) మధ్య జరుగుతోన్న భీకర ఘర్షణతో గాజా ప్రాంతంలోని అమాయక ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. చిన్నారులతో సహా వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడుల వల్ల పౌరులు మృతి చెందడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌(Irfan Pathan) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. (Israel Hamas Conflict)

‘ప్రతిరోజూ గాజాలో పదేళ్లలోపు ఎందరో అమాయకపు చిన్నారులు అసువులు బాస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచం మౌనం వహిస్తోంది. ఒక క్రీడాకారుడిగా నేను నా గళాన్ని మాత్రం వినిపించగలను. స్పృహ మరిచి చేస్తోన్న ఈ హత్యలను ఆపేందుకు ప్రపంచ నేతలంతా ఏకం కావడానికి ఇదే సరైన సమయం’ అని ఇర్ఫాన్‌  సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఐరాస(UN)ను ట్యాగ్ చేశారు. ఇదివరకు భారత టెన్నిస్ దిగ్గజం సానియ మీర్జా కూడా గాజాలోని మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మీ అభిప్రాయం ఏదైనా సరే.. గాజాలో నీరు, కరెంటు, ఆహారం అందక అల్లాడిపోతోన్న ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అభ్యర్థించారు.

గాజా గగనతలంలో అమెరికా డ్రోన్లు.. బందీల కోసం గాలింపు

ఇదిలా ఉంటే.. వైమానిక దాడులతో విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ ప్రస్తుతం భూతల దాడుల తీవ్రతను కూడా పెంచింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణతో గాజాలో ఇప్పటివరకు 9వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. వారిలో 3,600 మంది చిన్నారులున్నారు. 30వేల మందికిపైగా గాయపడ్డారని హమాస్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ కోసం తమ ప్రయత్నాలను అమెరికా, అరబ్‌ దేశాలు ముమ్మరం చేశాయి. మానవతా సాయానికి వీలుగా కాల్పులకు కాస్త విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(Biden) ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని