IND vs ENG: బుమ్రా అసాధారణ బౌలర్‌.. అండర్సన్‌ అప్పటివరకూ కొనసాగాలి: మైకెల్ క్లార్క్

భారత్‌లో మ్యాచ్‌లు అంటే స్పిన్నర్ల హవా ఉంటుందని అంతా భావిస్తారు. లైన్ అండ్‌ లెంగ్త్‌తో పాటు విభిన్నంగా బంతులను సంధిస్తే వికెట్లను తీయొచ్చని టీమ్‌ఇండియా పేసర్ బుమ్రా నిరూపించాడు.

Published : 08 Feb 2024 17:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రివర్స్‌ స్వింగ్‌, ఇన్‌-అవుట్‌ స్వింగ్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను తొలి రెండు టెస్టుల్లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బెంబేలెత్తించాడు. రెండో మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. తొలి టెస్టులో బరిలోకి దిగని ఇంగ్లాండ్ సీనియర్‌ పేసర్ జేమ్స్ అండర్సన్‌ (James Anderson) రెండో మ్యాచ్‌లో ఆడాడు. ఐదు వికెట్లతో మంచి ప్రదర్శనే చేశాడు. ఈక్రమంలో వారిద్దరి ఆటతీరుపైనా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్‌ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘రెండో టెస్టులో భారత్, ఇంగ్లాండ్‌ ప్రధాన పేసర్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌ పిచ్‌పై పేసర్లకు పెద్దగా సహకారం లభించని పరిస్థితుల్లోనూ 14 వికెట్లు పడగొట్టడం అద్భుతం. ముఖ్యంగా బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అతడొక అసాధారణ బౌలర్‌. కేవలం ఫాస్ట్‌ బౌలింగ్‌లోనే తన నైపుణ్యం కనిపించడం కాకుండా.. బంతిని స్వింగ్‌ చేయడంలో దిట్ట. స్పిన్‌ పిచ్‌పైనా రివర్స్‌స్వింగ్‌ రాబట్టి వికెట్లు తీశాడు’’ అని క్లార్‌ చెప్పాడు. 

41 ఏళ్ల వయసులో..

‘‘ఫాస్ట్‌ బౌలర్లలో ఒక వయసు వచ్చాక పేస్‌ తగ్గుతుంది. అలాగే బౌలింగ్‌ వేసే సామర్థ్యం కూడా కుంటుపడుతుంది. కానీ, 41 ఏళ్ల అండర్సన్‌ మాత్రం ఇప్పటికీ ఉత్సాహంగా బంతులను సంధించడం అభినందనీయం.  రెండో టెస్టులో దాదాపు 35 ఓవర్లు బౌలింగ్‌ వేశాడు. అతడి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. చాలాసార్లు గాయాలబారిన పడ్డాడు. ఇప్పటికీ అండర్సన్ బౌలింగ్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అందుకే, అతడు ఎంతకాలం ఆడాలని భావిస్తాడో అప్పటివరకూ కొనసాగాలి. ఇంగ్లాండ్‌ తరఫున చాలా రికార్డులు నెలకొల్పాడు. బెన్‌ స్టోక్స్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్ కూడా సీనియర్‌ బౌలర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి. రెండో టెస్టులో అతడి బౌలింగ్‌ను చూసిన తర్వాత మరికొంతకాలం ఆడగలడనే నమ్మకం కలుగుతోంది’’ అని మైకెల్‌ క్లార్క్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని