Ambati Rayudu: సీఎస్‌కే ఎంతో స్పెషల్‌.. ధోనీ తర్వాత అతడే కెప్టెన్‌: అంబటి రాయుడు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) భారత జట్టులో కంటే ఐపీఎల్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.

Updated : 25 Nov 2023 13:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత ఐపీఎల్‌ (IPL) ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఆ టోర్నీకి వీడ్కోలు పలికేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఎనిమిదేళ్లు (2010-2017), చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు (2018-2023) ఆరేళ్లు ప్రాతినిధ్యం వహించాడు. ఇరు జట్ల తరఫున ఐదు టైటిళ్లు సాధించిన స్క్వాడ్‌లో సభ్యుడు కావడం విశేషం. ముంబయి తరఫున 2015 ఫైనల్‌లో అంబటి రాయుడు ఆడిన ఇన్నింగ్సే ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం నాటితో ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే అంబటి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సీఎస్‌కే అతడిని వదిలేయనుంది. ఈ క్రమంలో అంబటి రాయుడు తన ఐపీఎల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 

‘‘నా ఐపీఎల్‌ కెరీర్‌ను ముంబయితో ప్రారంభించా. దాదాపు ఎనిమిదేళ్లు ఆడా. అదొక అద్భుత ప్రయాణం. నేను ఉన్నప్పుడు మేం మూడుసార్లు విజేతగా నిలిచాం. రెండు సార్లు ఛాంపియన్‌ లీగ్‌ను దక్కించుకున్నాం. అయితే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు మారిపోయా. నా జీవితంలో ఆ జట్టు తరఫున ఆడటం ఎంతో ప్రత్యేకమైంది. అప్పటి వరకు ఒక డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్న నాకు సీఎస్‌కేతో అనుభవం కొత్తగా అనిపించింది. బ్లూ ప్యాడ్ల బదులు యెల్లోవి ధరించా. ముంబయి జట్టుతోనే తలపడ్డా. నా వికెట్‌ను తీసిన వారితోనే ప్రాక్టీస్‌ చేశా. ఒక్కోసారి ఇదంతా నా మైండ్‌లోకి వస్తే వింతైన అనుభవం కలిగేది. ప్రతి రోజూ దానిని గుర్తు చేసుకునేవాడిని. సీఎస్‌కేతో ఆడిన సమయం నాకెప్పటికీ స్పెషలే’’ అని అంబటి రాయుడు తెలిపాడు. 

అతడికే అవకాశాలు ఎక్కువ..

కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే సీఎస్‌కే ఆడుతోంది. వచ్చే సీజన్‌లో ధోనీ సారథ్యంపై ఇప్పటివరకైతే ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, ఆ తర్వాతి సీజన్‌లో మాత్రం సీఎస్‌కేకు కొత్త కెప్టెన్‌ నియామకం జరగడం తథ్యమనే వార్తలు వస్తున్నాయి. దీంతో ధోనీ స్థానంలో సీఎస్‌కే సారథిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. దానికి అంబటి రాయుడు తన విశ్లేషణ వెల్లడించాడు. ‘‘ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే, మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. జడేజాకు మరోసారి అవకాశం ఇవ్వడం కష్టమే’’ అని అంబటి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని