Kapil: టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు: కపిల్‌ దేవ్‌

వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా (Team India) సన్నద్ధతను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సీనియర్లతోపాటు యువకులకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే టీ20ల్లో దూకుడుగా ఆడే సూర్యకుమార్‌ యాదవ్ (Surya Kumar Yadav)కు మాత్రం తక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కపిల్‌ దేవ్‌ తన అభిప్రాయాలను తెలిపాడు. 

Published : 21 Jan 2023 10:43 IST

ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్‌ యాదవ్‌.. టీ20ల్లో భారీ ఇన్నింగ్స్‌లను ఆడటంలో దిట్ట. దాదాపు ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు బాది సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో నంబర్‌వన్‌ ర్యాంకర్‌. అలాంటి సూర్యకుమార్‌కు వన్డేల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌.. ఇలా ఎవరైనా గాయపడితేనే జట్టులోకి తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు రెగ్యులర్‌గా  జట్టులో స్థానం కల్పించకపోవడంపై టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌లుగా ఎంపికైన ఆటగాడికి వన్డేల్లో స్థానం లేకపోవడం విచిత్రంగా ఉందన్నాడు.

‘‘ కొంతకాలమైన ఒకే జట్టును ఎంపిక చేసి మ్యాచ్‌లను ఆడించాలి. అందులో ఎవరైనా సరిగా ఆడకపోతే అప్పుడు మార్పు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన ఆటగాడిని తదుపరి మ్యాచ్‌కు పక్కన పెట్టడం.. జట్టులోకి వేరొకరు రావడం ఏంటో క్రికెటర్లుగా మాకు అర్థం కావడం లేదు. సూర్యకుమార్ పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టేశాడు. అయినా సరే అతడికి వన్డేల్లో చోటు కష్టంగా మారడం చూస్తున్నాం’’

‘‘అందుకే ఇలాంటి సమస్యకు పరిష్కారంగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసుకొంటే బాగుంటుంది. ఇదంతా క్రికెట్‌ బోర్డు చూసుకొంటుంది. సెలెక్టర్లు తమ ప్రణాళికపై స్పష్టంగా ఉండాలి. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంది క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. బయట నుంచి చూసే నాకు కూడా మనకు మూడు జట్లు ఉన్నాయి అనిపిస్తుంది. దాంతో మరింతమంది నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది’’ అని కపిల్‌ దేవ్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని