
Neeraj Chopra: మళ్లీ జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా.. కానీ ఈసారి ఎక్కడో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్ చరిత్రలోనే భారత అథ్లెటిక్స్‌లో మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించి కోట్లాది భారతీయుల స్వప్నాన్ని నెరవేర్చాడు నీరజ్ చోప్రా. దీంతో భారత యువతకు అతడు ఐకాన్‌గా మారాడు. ఇప్పుడు నీరజ్ ఏది చేసినా సంచలనమే. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను అందరికంటే దూరం విసిరిన అనంతరం అతడు అక్కడే సంబురాలు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అదే రీతిలో మరోసారి సంబురాలు జరుపుకొన్నాడు. కానీ ఈసారి నేలపై కాదు.. అతడి చేతిలో జావెలిన్ కూడా లేదు.. నీటి లోపల జావెలిన్‌ను విసురుతున్నట్లు నీరజ్ చేసిన విన్యాసం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం నీరజ్ చోప్రా మాల్దీవుల్లో విహరిస్తున్నాడు. అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. నీటిలో విన్యాసాలు చేస్తున్నాడు. ఒలింపిక్స్‌లో నీరజ్ జావెలిన్‌ను విసరడం, అనంతరం సంబురాలు చేసుకునే దృశ్యాలు దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. తాజాగా అతడు మరోసారి ఆ దృశ్యాలను గుర్తుచేశాడు. ఆక్సిజన్ సిలిండర్‌తో నీటిలోపలికి దిగిన నీరజ్ జావెలిన్‌ను విసిరినట్లు చేసి, చిందులు వేశాడు. ట్విటర్ వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ‘ఆకాశంలోనైనా, భూమి మీదైనా, లేదా నీటిలోనైనా ఎప్పుడూ జావెలిన్ గురించే ఆలోచిస్తూ ఉంటా’ అంటూ వ్యాఖ్యలను జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.