Ishan Kishan: దుబాయ్‌లో పార్టీలకు వెళ్లడంతోనే ఇషాన్‌ను పక్కనపెట్టారా?

అఫ్గానిస్థాన్‌తో గురువారం నుంచి మూడు టీ20ల (IND vs AFG) సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌కు మాత్రం చోటు దక్కలేదు.

Published : 10 Jan 2024 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌కు (Ishan Kishan) సంబంధించి ఒక వార్త క్రికెట్‌ వర్గాల్లో హల్ చల్‌ చేస్తోంది. ‘మానసిక అలసట’ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు కిషన్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ కోసం (IND vs AFG) అందుబాటులో ఉంటానని ఇషాన్‌ బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కానీ, సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. అతడిని ఎందుకు తీసుకోలేదని అభిమానులు, విమర్శకులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తారు. ఇషాన్‌ను ఎంపిక చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

కుటుంబంతో కలిసి గడిపేందుకు ‘మానసిక అలసట’ కారణం చెప్పిన ఇషాన్‌.. దుబాయ్‌లో పార్టీలకు హాజరు కావడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంతోనే అఫ్గాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ ముందు నుంచే జట్టుతో ప్రయాణిస్తూ రిజర్వ్‌బెంచ్‌కే  పరిమితమైన ఇషాన్‌ మానసికంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని భావించాడట. ఇదే విషయం బీసీసీఐ దృష్టికీ తీసుకెళ్లాడు. కానీ, సెలక్టర్లు మాత్రం అంగీకరించకుండా జట్టులోకి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లు ఆడకూడదని ఇషాన్ నిర్ణయించుకున్నప్పటికీ.. దానికీ ఆమోదం దక్కలేదు. చివరికి టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనని.. కుటుంబంతో కలిసి గడిపేందుకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరడంతో బీసీసీఐ అంగీకరించి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేయలేదు. తాజాగా అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడాలని ఆశించాడు. ఎంపిక చేయకపోవడంపై అతనికి మద్దతుగా నిలిచే అభిమానులు విమర్శలకు దిగారు.

ఎక్కడికి వెళ్తే ఏంటి?

‘‘సిరీస్‌ల నుంచి బ్రేక్‌ తీసుకున్న తర్వాత సదరు ప్లేయర్‌ ఎక్కడికి వెళ్తే ఏంటి? తన సమయాన్ని ఎక్కడైనా గడిపే స్వేచ్ఛ ఆటగాడికి ఉంటుంది. ఇషాన్‌ కిషన్ తన సోదరుడి పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌ వెళ్లాడు. మానసిక ప్రశాంతత కోసం ఏ దేశానికైనా వెళ్లొచ్చు. అందుకోసం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దానిని కారణంగా చూపించి పక్కన పెట్టడం సరైంది కాదు’’ అని పలువురు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని