Rohit Sharma:: ఇది ఆరంభమే.. ఇంకా ముందుంది..: రోహిత్‌ ట్వీట్‌

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠభరిత విజయం తర్వాత రోహిత్‌, హర్దిక్‌లు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. వీరి స్పందనలు సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌కు దారి తీశాయి.

Updated : 08 Apr 2024 11:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి ఖాతా తెరిచింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది ఆరంభం మాత్రమే అన్నట్లు అర్థమొచ్చేలా ఆఫ్‌ది మార్క్‌ అని ట్వీట్‌ చేశాడు. దీనికి రేసుల స్టార్టింగ్‌లో ఊపే ‘చెకర్డ్‌ ఫ్లాగ్‌’ ఎమోజీని యాడ్‌ చేశాడు. ఈ పోస్టులో రోహిత్‌-షెపర్డ్‌, మైదానంలో అభిమానులు, ప్రాక్టిస్‌లో పంత్‌, ఇషాంత్‌ ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వివిధ ఎన్జీవోలకు చెందిన దాదాపు 18,000 మంది చిన్నారులు హాజరయ్యారు.

శతకం పూర్తిచేసిన హిట్‌మ్యాన్‌..

హిట్‌ మ్యాన్‌ తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో ఓ అరుదైన రికార్డు అందుకొన్నాడు. ఐపీఎల్‌లో క్యాచుల శతకాన్ని పూర్తి చేశాడు. వాంఖడే మైదానంలో నిన్న జరిగిన మ్యాచ్‌ చివర్లో కొయెట్జీ ఓవర్‌లో బంతిని రోహిత్‌ అందుకోవడంతో 100వ క్యాచ్‌ పూర్తయింది. దీంతో ముంబయి విజయం సంపూర్ణమైంది. రైనా, కోహ్లీ, పోలార్డ్‌ తర్వాత క్యాచ్‌ల శతకం మైలురాయిని చేరుకొన్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కూడా హిట్‌మ్యాన్‌కు మంచి ఫీల్డింగ్‌ రికార్డు ఉంది. టెస్టుల్లో 60, వన్డేల్లో 93, టీ20ల్లో 60 క్యాచ్‌లు అందుకొన్నాడు.

హార్దిక్‌ ఫ్యాన్స్‌ గుస్సా..

మరోవైపు మ్యాచ్‌ అనంతరం ముంబయి కెప్టెన్‌ పాండ్య ( Hardik Pandya) కూడా ఎక్స్‌లో స్పందించాడు. ‘మేము లేచి పరిగెడుతున్నాం ’ అన్న క్యాప్షన్‌తో జట్టు ఫొటోలు షేర్‌ చేశాడు. దీంతో రోహిత్‌, హార్దిక్‌ పోస్టులను పోల్చుతూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వార్‌కు తెరతీశారు. ‘రోహిత్‌ ఆత్మన్యూనతతో ఉన్నాడు.. పాండ్య మాత్రం రోహిత్‌ సహా అందరి ఫొటోలు పోస్టు చేశాడు’ అని ఓ యూజర్‌  కామెంట్‌ చేయగా.. అందుకు హిట్‌ మ్యాన్‌ ఫ్యాన్‌ స్పందిస్తూ.. ‘‘హార్దిక్‌ ఆడింది ఏముందని అతడు ఫొటోలో భాగం కావడానికి. రోహిత్‌ ఆడాడు కాబట్టి అతడి చిత్రాన్ని వాడారు’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ సోషల్‌ మీడియా వార్‌ ఎలా ఉన్నా.. నిన్న మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌ ప్రమోషన్స్‌ వీడియోలో ఇద్దరూ కలిసి నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని