Asia Cup 2023: టీమ్‌ఇండియా అలా చేస్తోంది.. మీరు ఇంకా పాతకాలంలోనే ఉండిపోతే ఎలా?: షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 (Asia Cup 2023) సూపర్ -4 దశలోనే పాకిస్థాన్‌ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Published : 16 Sep 2023 15:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ను (Asia Cup 2023) గెలిచి ప్రపంచ కప్‌ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావించిన పాకిస్థాన్‌ (Pak) ఆశలకు శ్రీలంక బ్రేక్‌ వేసింది. సూపర్ -4లో కీలకమైన పోరులో పాక్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు (IND vs SL Final) చేరిన సంగతి తెలిసిందే. పాక్‌ ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాతకాలంనాటి ఆలోచనాధోరణితో వ్యవహరిస్తుండటంపై విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు తుది జట్టు ఎంపిక నాసిరకంగా ఉందని వ్యాఖ్యానించాడు. రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్న ఉత్తమ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. విఫలమైన వారితోనే ఆడించాలని విమర్శించాడు.

‘‘ పాకిస్థాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్ ఇంకా పాతకాలం నాటి ఆలోచనా ధోరణితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా నిర్ణయాలను ఓసారి పరిశీలిస్తే వారేం చేస్తున్నారో అర్థమవుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చింది. తమ రిజర్వ్‌బెంచ్‌ను పరీక్షించుకుంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. జూనియర్లతో ఆడించింది. ఇదంతా ప్రపంచకప్‌ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు సిద్ధమైంది. ఇలాంటి నిర్ణయాలు చాలా కీలకం. మీరు టోర్నీకి 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. తుది జట్టులో ఉన్న వారితోపాటు మిగతా వారూ నాణ్యమైన ఆటగాళ్లే. వారితో మీకెలాంటి సమస్య లేదు కదా.. 

షాదాబ్‌ ఖాన్‌కు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే అతడికి ప్రత్యామ్నాయంగా ఒసామా మిర్ ఉన్నాడు. పాకిస్థాన్‌ తరఫున ఉత్తమ ప్రదర్శన చేశాడు. వరుసగా మ్యాచుల్లో విఫలమైన వారికి విశ్రాంతి ఇచ్చి కొత్తవారితో ఆడించాలి. విఫలమైన వారిని స్క్వాడ్‌లో నుంచి తప్పించమని చెప్పను. వారికి రెస్ట్‌ ఇవ్వాలి. ప్రధాన కోచ్‌, బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌ కోచ్‌తో మాట్లాడించాలి. అయితే, పాక్‌ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు’’ అని షాహిద్ అఫ్రిది తెలిపాడు. పాకిస్థాన్‌ ఆసియా కప్ సూపర్ -4ను బంగ్లాదేశ్‌పై ఘన విజయంతోనే ప్రారంభించింది. అయితే, భారత్‌, శ్రీలంక చేతిలో ఓటమిపాలై నిష్ర్రమించింది.  నసీమ్ షా, హారిస్ రవూఫ్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని