Shami: వసీమ్‌ వివరించాడు.. అయినా హసన్‌ అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: పాక్‌ మాజీపై షమీ నిప్పులు

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత విజయాలను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేసిన పాక్‌ మాజీ ఆటగాడికి మహమ్మద్‌ షమీ కౌంటర్ ఇచ్చాడు. అలా మాట్లాడే ముందు ఇతరులు చెప్పింది కూడా వినాలని హితవు పలికాడు.

Updated : 09 Nov 2023 12:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్‌ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. అయితే, ఈ విజయాలు కొందరు పాక్‌ మాజీ ఆటగాళ్లకు కంటగింపుగా మారినట్లుంది. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా ఆరోపణలు గుప్పించాడు. అయితే, అతడి వ్యాఖ్యలను ఇప్పటికే మరో పాక్‌ క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ కొట్టిపారేశాడు. ఐసీసీ అధికారుల సమక్షంలోనే బంతుల ఎంపిక ఉంటుందని వివరించాడు. అయినా, హసన్‌ రజా అలాంటివి పట్టించుకోకుండా ఈసారి డీఆర్‌ఎస్‌పై నోరుపారేసుకున్నాడు. మోసానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత సీనియర్‌ పేసర్ మహమ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘‘కొంచెమైనా సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇది ఐసీసీ వరల్డ్‌ కప్‌. మీ లోకల్‌ టోర్నమెంట్ కాదు. మీరు (హసన్ రజా) గతంలో ప్లేయరే కదా. ఇప్పటికే వసీమ్‌ అక్రమ్‌ సవివరంగా చెప్పాడు. కానీ, ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. అంటే క్రికెట్‌ దిగ్గజం, మీ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌నే మీరు నమ్మడం లేదా? మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు’’ అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది. పాక్‌ మాజీకి సరైన సమాధానం ఇచ్చావని షమీని క్రికెట్ అభిమానులు ప్రశంసించారు. 

ప్రస్తుతం భారత్ వన్డే ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా 8 విజయాలు సాధించిన టీమ్‌ఇండియా లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో నవంబర్ 12న (ఆదివారం) బెంగళూరు వేదికగా తలపడనుంది. అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించే భారత్ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ప్రయోగాలకు వేదికగా మార్చుకొనే అవకాశం ఉంది. భారత రిజర్వు ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని