Ishan-Suryakumar: ‘ఇషాన్ 2 ఇన్‌ 1 ప్లేయర్‌.. ఆ ఓవర్లలో ఎలా ఆడాలో సూర్యకుమార్‌కు తెలీదు’

త్వరలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)ను బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా తీసుకోవడంపై సెలక్షన్‌ కమిటీకి భారత సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashiwn) మద్దతుగా నిలిచాడు.

Published : 07 Sep 2023 12:47 IST

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం ఇటీవల టీమ్‌ఇండియా (Team India) జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan)ను తీసుకున్నారు. సంజు శాంసన్‌కు అవకాశం దక్కుతుందని భావించినా సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపలేదు. ఇషాన్‌ను బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా తీసుకోవడంపై సెలక్షన్‌ కమిటీకి భారత సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అతడిని ‘టూ ఇన్‌ వన్’ ప్లేయర్‌గా అభివర్ణించాడు. ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్‌ మధ్య పోటీ లేదని పేర్కొన్నాడు. 

‘‘ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌ మధ్య పోటీ లేదు. ఇషాన్ చాలా పాత్రలను పోషిస్తాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంచుకున్నప్పుడు బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం. ఇషాన్‌ టూ ఇన్‌ వన్ ప్లేయర్‌. బ్యాకప్ ఓపెనర్ కూడా. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానానికి బ్యాకప్‌గా ఉన్నాడు. ఆ స్థానంలో బరిలోకి దిగి మంచి స్కోర్లు సాధించాడు. అతడు నిస్వార్థ ఆటగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్‌ చేస్తాడు’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.

సూర్యకుమార్‌కు ఆ విషయం తెలీదు: సంజయ్ బంగర్

టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు 25 నుంచి 40 ఓవర్ల మధ్య పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడుతున్నాడని భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఎలా ఆడాలనే విషయాలపై అతడు దృష్టి సారించాలన్నాడు. వన్డేల్లో తానింకా మెరుగుపడాల్సిన అవసరముందని ఇటీవల సూర్యకుమారే స్వయంగా అంగీకరించాడు. 

‘‘ప్రతి బ్యాటర్‌ పరుగులు ఎలా రాబట్టాలో తెలుసుకోవాలి. సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. బౌండరీలే లక్ష్యంగా ఆడతాడు. ఏ గ్యాప్‌లో ఏ షాట్‌ కొడితే సిక్స్‌, ఫోర్‌ వెళ్తుందనే విషయంలో అతడికి మంచి అవగాహన ఉంది. కానీ, సూర్యకుమార్‌ నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 25 నుంచి 40 ఓవర్ల మధ్య ఎలా బ్యాటింగ్ చేయాలో అతడు తెలుసుకోవాలి. ఈ ఓవర్లలో ఎలా పరుగులు రాబట్టాలనే విషయం అతడికి తెలీదు. ఈ బలహీనతపై అతడు దృష్టిపెట్టాలి’’ అని సంజయ్‌ సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని