IND vs SA: అతడి వికెట్ల దాహం తీరదు: కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌

సూర్యకుమార్‌ అద్భుతమైన శతకం.. భారత సూపర్ బౌలింగ్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో 100 పరుగులు కూడా దాటకుండానే కుదేలైంది. 

Updated : 15 Dec 2023 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత్‌ (IND vs SA) సమం చేసింది. రెండో టీ20లో ఓటమికి మూడో మ్యాచ్‌లో విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్‌ మాట్లాడారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ సూర్యకుమార్‌కు (Surya Kumar Yadav) దక్కాయి. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. 

నేను బాగానే ఉన్నా: సూర్య

‘‘ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో కాలు జారడంతో కొంత ఇబ్బంది పడ్డా. అయితే, ఇప్పుడు బాగానే నడుస్తున్నా. కీలక సమయంలో విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు. ఎప్పటిలానే నిర్భయంగా క్రికెట్‌ ఆడాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం. తొలుత బ్యాటింగ్‌ చేస్తే స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచాలి. దాని వల్ల బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించేందుకు అవకాశం లభిస్తుంది. మా ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టేశారు. దూకుడుగా ఆడారు. కుల్‌దీప్‌ యాదవ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు అల్పసంతోషి కాదు.. వికెట్ల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అదే అతడి ప్రత్యేకత. బర్త్‌డే సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ మాకు ఎంతో కీలకమని తెలుసు. జట్టులో సమతూకం చాలా అవసరం. ప్రతి క్షణం నేను ఆస్వాదించా’’ అని సూర్య వ్యాఖ్యానించాడు.

టార్గెట్‌ను ఛేదించగలమని భావించాం: మార్‌క్రమ్‌ (Markram)

‘‘బ్యాటింగ్‌కు దిగినప్పుడు భారత్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదన సాధ్యమేనని భావించాం. మేం ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో టీమ్‌ఇండియా బ్యాటర్లు మైదానం నలువైపులా షాట్లు కొట్టగలిగారు. మేం కూడా అలానే ఆడొచ్చని అనుకున్నాం. కానీ, పిచ్‌ ఒక్కసారిగా మారిపోయింది’’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్‌ తెలిపాడు. 

కుల్‌దీప్‌ బర్త్‌డే స్పెషల్‌..

టీ20ల్లో భారత్‌ తరఫున ఐదు అంతకంటే ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) నాలుగో బౌలర్‌. దీపక్ చాహర్ (6/7), చాహల్ (6/25), భువనేశ్వర్‌ కుమార్‌ (5/4) తర్వాత కుల్‌దీప్‌ (5/17) ఉన్నాడు. టీ20ల్లో కుల్‌దీప్‌ రెండోసారి ఐదు వికెట్లు తీశాడు. అలాగే బర్త్‌డే రోజున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌ కుల్‌దీప్‌ కావడం విశేషం. భారత్‌ నుంచి తమ పుట్టిన రోజునాడు బౌలింగ్‌ చేసిన ముగ్గురు బౌలర్లూ డిసెంబర్‌లోనే జన్మించడం గమనార్హం. కుల్‌దీప్‌ (డిసెంబర్‌ 14) కాకుండా యువరాజ్‌ సింగ్‌ (డిసెంబర్ 12) శ్రీలంకపై 2009లో 3/23, రవీంద్ర జడేజా (డిసెంబర్‌ 6) విండీస్‌పై 2020లో 1/30 బౌలింగ్‌ చేశారు. వీరు ముగ్గురూ ఎడమచేతివాటం స్పిన్నర్లే కావడం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని