కేంద్ర మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయండి

కొవిడ్‌ నియంత్రణకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ జారీ చేస్తున్న మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్ధారణ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించింది.

Updated : 18 Jan 2022 04:05 IST

నిర్ధారణ పరీక్షలు పెంచండి
కొవిడ్‌ నియంత్రణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నియంత్రణకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ జారీ చేస్తున్న మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్ధారణ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించింది. ప్రజలు భౌతిక దూరం పాటించేలా, గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంది. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించింది. కరోనా రోగులకు అవసరమైన పడకలు, ఔషధాలను అందుబాటులో ఉంచాలంది. కొవిడ్‌పై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రోజుకు లక్ష వరకు పరీక్షలు నిర్వహించాలని గతేడాది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు కావడం లేదని, వాటిని పక్కాగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ స్పందిస్తూ హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని