Published : 25 Jun 2022 05:32 IST

నాణ్యమైన వైద్యానికో గీటురాయి

100కు పైగా ప్రభుత్వాసుపత్రులకు ఎన్‌క్వాస్‌ ధ్రువీకరణ
తాజాగా మరికొన్నింటికీ గుర్తింపు
మెరుగైన వాటికి కేంద్రం నగదు ప్రోత్సాహకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యసేవల్లో నాణ్యత ప్రమాణాలను కొనసాగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపును ఇప్పుడు తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ సాధిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతను పరీక్షించి, ప్రోత్సాహకాలివ్వడానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ (ఎన్‌క్యూఏఎస్‌-ఎన్‌క్వాస్‌)’ సంస్థ ఇచ్చే ధ్రువపత్రాన్ని రాష్ట్రంలోని 100కి పైగా సర్కారీ ఆసుపత్రులు ఇప్పటికే పొందాయి. తాజాగా నిర్మల్‌ ప్రాంతీయ ఆసుపత్రి, కరీంనగర్‌ జిల్లా మానకొండూరు, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, రాయికోడెలోని గ్రామీణ పీహెచ్‌సీలు, హనుమకొండ జిల్లా పోచమ్మకుంట, జగిత్యాల జిల్లా మోతెవాడల్లోని పట్టణ పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్‌ ధ్రువీకరణను సాధించాయి. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీకి శుక్రవారం లేఖ అందింది. రాష్ట్రంలో 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ ధ్రువపత్రం పొందిన పీహెచ్‌సీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా మూడేళ్లపాటు ఏటా రూ.3 లక్షల చొప్పున నగదు పారితోషికం లభిస్తుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామొహంతి పేర్కొన్నారు.

ఏమిటీ గుర్తింపు?

ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు గుర్తింపునిచ్చే అంతర్జాతీయ సంస్థ ‘ఇస్‌క్వా (ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ క్వాలిటీ ఆన్‌ హెల్త్‌కేర్‌)’. మనదేశంలోనూ స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న ‘నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ’కు అనుబంధంగా ‘ఆసుపత్రుల జాతీయ గుర్తింపు సంస్థ (ఎన్‌ఏబీహెచ్‌)’ పనిచేస్తోంది. ఇది ప్రధానంగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధ్రువీకరణ పత్రాలిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతను పరీక్షించడానికి 2016లో ప్రత్యేకంగా ‘ఎన్‌క్వాస్‌’ను ప్రవేశపెట్టింది. ఇది కూడా ‘ఇస్‌క్వా’కు అనుబంధంగానే పనిచేస్తుంది. ఎన్‌క్వాస్‌ బృందం ప్రధానంగా 18 విభాగాల్లో ఆసుపత్రిని సునిశితంగా పరిశీలిస్తుంది. జిల్లా/ప్రాంతీయ ఆసుపత్రిలో 362 అంశాలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 290, గ్రామీణ పీహెచ్‌సీలో 250, పట్టణ పీహెచ్‌సీలో 198 అంశాలను పరీక్షిస్తారు. అన్ని విభాగాల్లోనూ కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధిస్తేనే ‘గుర్తింపు పత్రం’ లభిస్తుంది. ఈ పత్రం మూడేళ్ల వరకు చెల్లుబాటవుతుంది.

ఇవీ ప్రయోజనాలు..

కనీసం 70 శాతం మార్కులు సాధించిన ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం పారితోషికం అందిస్తుంది. పూర్తిస్థాయి గుర్తింపు పొందిన జిల్లా/ప్రాంతీయ ఆసుపత్రి/సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఒక్కో పడకకు రూ. 10 వేల చొప్పున అందిస్తుంది. ఉదాహరణకు 350 పడకలున్న జిల్లా ఆసుపత్రికి ఏడాదికి రూ.35 లక్షలు, మూడేళ్లలో రూ.1.05 కోట్లు అందుతాయి. ఈ నిధుల్లో 75 శాతం ఆసుపత్రి అభివృద్ధి సంఘాని(హెచ్‌డీఎస్‌)కి, 25 శాతం ఆసుపత్రి సిబ్బందికి లభిస్తాయి. 70 శాతం కంటే తక్కువగా.. 65-69 శాతం మార్కులు సాధించిన ఆసుపత్రులకు కూడా కొంత నగదు అందుతుంది. ‘సేవలను మెరుగుపర్చుకుంటాం’ అనే హామీ మేరకు వాటికి ఒక్కో పడకకు రూ.7 వేల చొప్పున, పీహెచ్‌సీలకైతే ఏడాదికి రూ.2 లక్షల చొప్పున పారితోషికాన్ని అందిస్తారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts