ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు.

Published : 20 Apr 2024 04:46 IST

నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం అధ్యక్షతన శుక్రవారం దిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణ నుంచి చేపట్టనున్న గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెదిరె శ్రీరాం ‘ఈనాడు’తో మాట్లాడుతూ, ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణంతో దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ(తుపాకుల గూడెం)కి, ఎగువన ఉండే మేడిగడ్డ బ్యారేజీకి ఎటువంటి నష్టం ఉండదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన..ఆ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీలను మాత్రమే గోదావరి నుంచి తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ నీటి వాటాలపై ఈ మాత్రం ప్రభావం ఉండదు. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం తెలంగాణ నీటి ప్రయోజనాలకూ భంగం కలగదు.  తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అనుసంధానం ద్వారా తరలించే నీటిలో యాభై శాతం ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఈ ప్రాజెక్టులో భాగంగా ఎక్కువ కేటాయింపులు ఇచ్చే అవకాశాలూ ఉంటాయి. అనుసంధాన ప్రాజెక్టులో ఇప్పటికే తెలంగాణకు 40 టీఎంసీలు, ఏపీకి 40 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి’ అని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపైనా చర్చ జరిగింది. మేడిగడ్డ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన అంశాలన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే ఉంటాయని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని