ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం

‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది.

Updated : 28 Apr 2024 05:40 IST

ప్రజలను ఏకం చేసి వాటిని కాపాడుకోవాలి
ప్రొఫెసర్‌ యోగేందర్‌ యాదవ్‌

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: ‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. దేశంలో అసమానతలున్నాయి. వనరులను సమానంగా పంపిణీ చేయాలంటే అది తప్పయిపోయింది. కులగణన ద్వారా న్యాయం చేయాలని అడగటం నేరమైపోయింది. రాజ్యాంగాన్ని, గణతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలుస్తుంటే దేశ పౌరులు క్రికెట్‌ మ్యాచ్‌ మాదిరిగా వీక్షిస్తూ మౌనం వహిస్తున్నారు. ఈ వైఖరిని విడనాడాలి. వ్యవస్థలపై దాడులను తిప్పికొడుతూ ప్రజలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలి’ అని భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యోగేందర్‌ యాదవ్‌ కోరారు. దేశాన్ని విభజించే కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ ఆధ్వర్యంలో శనివారం ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాలలో ‘ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు- రాజ్యాంగ విలువలు- పౌరులు, పౌర సంస్థల పాత్ర’ అనే అంశంపై శనివారం చర్చాగోష్ఠి నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలో 70 శాతం సంపద 52 మంది వద్దే ఉందని, దీన్ని సమానంగా పంపిణీ చేయాలని అడిగితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. లౌకికవాదం సంక్షోభంలో ఉందన్నారు. దేశ పునాదులను నాశనం చేస్తూ.. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ఓట్లడగడం తగదన్నారు. ‘నోటి మాట’ ప్రధాన ఆయుధంగా ప్రజలను చైౖతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. దేశంలో మార్పు ఆవశ్యకత గురించి సమాధానమిస్తూ.. ‘పాలకులు మొదటిసారి గెలిచినపుడు జాగ్రత్తగా ఉంటారు. రెండోసారి అవినీతికి పాల్పడతారు. మూడోసారి గెలిస్తే ప్రజల నెత్తిపై కూర్చుని గూండాయిజం, రౌడీయిజం చేస్తారు’ అని అన్నారు. ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సుకుమార్‌, డాక్టర్‌ సమున్నత, భారత్‌ జోడో అభియాన్‌ రాష్ట్ర కన్వీనర్‌ విస్సా కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని