Updated : 06/08/2021 20:44 IST

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా?

కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్. ఎందుకంటే దీనివల్ల అవసరానికి మించి ఇమ్యూనిటీ స్థాయులు పెరిగినా అదీ వారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు. కాబట్టి పోషకాహారంతోనే వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

ఎలాంటి సమస్యలొస్తాయి?

పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువైనా, ఎక్కువైనా సమస్యే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సప్లిమెంట్లను అందించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మితిమీరి ప్రతిస్పందిస్తుంది. తద్వారా అది వారి శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుంది. ఈ క్రమంలో వారి ముఖ్యమైన అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా తీవ్ర జ్వరం, కంటి సమస్యలు, నోటి అల్సర్లు, బరువు తగ్గిపోవడం, ఎదుగుదలలో లోపాలు.. వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఈ ఇమ్యూనిటీ సప్లిమెంట్లు ఇన్ఫెక్షన్ల బారి నుంచి వారిని కాపాడతాయన్న ఆధారాలు కూడా ఎక్కడా లేవంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలకు విటమిన్‌ సప్లిమెంట్స్‌ అందించాలన్న ఆలోచన మానుకొని సహజసిద్ధంగానే వారి రోగనిరోధక శక్తిని పెంచడం అన్ని విధాలా శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా.. ఆనందంగా..!

* చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి చక్కటి పోషకాహారం అందించడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిమ్మజాతికి చెందిన పండ్లు, స్ట్రాబెర్రీ, క్యారట్స్‌, ఆకుకూరలు, బీన్స్‌, పెరుగు, అల్లం-వెల్లుల్లి.. వంటి వాటిని వారి రోజువారీ మెనూలో చేర్చాలి. వీటి ద్వారా వారి శరీరానికి సరిపడా విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు, అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు అందుతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

* ఇమ్యూనిటీని పెంచడంలో నిద్రదీ కీలకపాత్ర. అయితే ఈ మధ్య చిన్నారులంతా మొబైల్‌-టీవీ వంటి గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతూ అర్ధరాత్రి దాకా నిద్రను త్యాగం చేస్తున్నారు. పసి పిల్లలు కూడా వీటికే అంకితమవుతున్నారు. కాబట్టి ఈ అలవాటును మాన్పించి వారు సజావుగా నిద్రపోయేలా చేసే బాధ్యత తల్లిదండ్రులదే! ఎందుకంటే ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు కనీసం 10 గంటలైనా సుఖంగా నిద్రపోవాలట!

* కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలంటే శరీరానికి సరిపడా విటమిన్‌ ‘డి’ అందించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో పిల్లల్ని రోజూ ఉదయం ఓ అరగంట సేపు లేలేత ఎండలో ఉంచాలి. ఉదయాన్నే ఆరుబయట ఎండ తగిలే చోట కుటుంబ సభ్యులంతా కలిసి వ్యాయామం చేయడం, కాసేపు ఆడుకోవడం.. చేస్తే అటు శరీరానికి ఉత్సాహం.. ఇటు ఆరోగ్యం.. రెండూ సొంతమవుతాయి.

* ఈ తరం పిల్లలు బయటి ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు బాగా అలవాటు పడ్డారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పైగా వీటిలో ఉండే అధిక కొవ్వులు, చక్కెరలు రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి పిల్లల్ని ఇలాంటి పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అంటే.. పెద్దలు కూడా బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం, బయట తినడం వంటివి తగ్గిస్తే పిల్లలూ ఈ అలవాటు మానుకుంటారు.

* నీళ్లు మన శరీర అవయవాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లడంతో పాటు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి. తద్వారా ఇమ్యూనిటీ దృఢంగా ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు అసలు నీళ్లే తాగరు. తద్వారా డీహైడ్రేషన్‌ సమస్య కూడా వస్తుంది. కాబట్టి వాళ్లు ప్లెయిన్‌ వాటర్‌ తాగడానికి ఇష్టపడకపోతే.. అందులో రుచికరమైన పండ్ల ముక్కలు, కీరా ముక్కలు లేదంటే పండ్ల రసాలు.. వంటివి అందించచ్చు. వీటితో పాటు రోజుకో కొబ్బరి బోండాం తప్పనిసరి!

* చిన్నారుల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచడం వల్ల వారిలో అనవసర ఆందోళనలు, భయాలు లేకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వారితో రోజూ కాసేపు సమయం గడపడం, వారికి నచ్చిన ఆటలు ఆడడం.. వంటివి చేస్తే వారి మనసూ రిలాక్సవుతుంది. వారిలో ఇమ్యూనిటీని పెంచడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.

* వీటితో పాటు పిల్లల చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తపడడం, వారుండే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు వారూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేయడం.. వంటివన్నీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలే!

కాబట్టి.. ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచుతాయన్న ఉద్దేశంతో చిన్నారులకు సప్లిమెంట్స్‌ వేయాలన్న ఆలోచన మానుకొని ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.. ఇక ఐదేళ్లు పైబడిన పిల్లల విషయంలోనూ ఈ న్యాచురల్‌ టిప్స్‌ పాటించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో ఇంకా ఏవైనా సందేహాలుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మాత్రం మరవద్దు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని