Updated : 01/11/2022 12:43 IST

ఆ శాడిస్ట్ పెట్టిన బాధల్ని మరిచిపోలేకపోతోంది.. ఏం చేయాలి?

మా అమ్మాయికి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశాం. మా అల్లుడు శాడిస్ట్‌. అమ్మాయిని చాలా బాధలు పెట్టాడు. చాలాకాలం వరకు మాకు ఆ విషయం తెలియలేదు. తెలిసిన తర్వాత విడాకులు ఇప్పించాం. ఇప్పుడు అమ్మాయి మాతోనే ఉంటోంది. కానీ, తను చాలా దిగులుగా ఉంటోంది. తన గదిలోంచి బయటకు కూడా రావడం లేదు. బలవంతపెడితే కానీ స్నానం, భోజనం చేయడం లేదు. గట్టిగా ఏమైనా అంటే ఏడుస్తోంది. మా అమ్మాయి తిరిగి సాధారణ మనిషి కావాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ఆమె ఒత్తిడికి గురై ఉండచ్చు. ఆ సమయంలో తన భర్త వేధింపులను మీకు చెప్పలేదంటున్నారు. తన బాధను మీకు చెబితే ఎక్కడ కంగారు పడతారేమోనన్న భయం ఆమెలో ఉండడం వల్ల అలా చేసి ఉండచ్చు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు ఆ బాధను తనలోనే దాచుకుని ముందుకు సాగింది. మీకు ఆ విషయం తెలిసిన తర్వాత విడాకులు ఇప్పించారని చెబుతున్నారు. అయితే ఆమె ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా తన బాధను మనసులో ఉంచుకోవడం వల్ల అది మెదడుపై ప్రభావం చూపించి ఉండచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రకాల సమస్యలు వస్తుంటాయి. ఒకటి పోస్ట్ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (PTSD). రెండు డిప్రెషన్.

ఒక వ్యక్తి తీవ్ర ఒత్తిడికి గురై దాన్నుంచి బయటపడిన తర్వాత వచ్చే సమస్యను ‘పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్’ అంటుంటాం. జరిగిన వాటి గురించి పదే పదే ఆలోచించడం, ఆ పరిస్థితులను తలచుకొని ఆందోళనకు, భావోద్వేగానికి గురవడం; నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, తరచూ భయపడుతుండడం వంటివి దీని లక్షణాలు.

ఇక రోజూ చేసే పనులపై కూడా ఆసక్తి తగ్గడం, నిద్ర పట్టకపోవడం, దిగాలుగా ఉండడం, నా పనైపోయిందని నెగెటివ్‌గా మాట్లాడడం వంటివి డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు. మీ అమ్మాయిలో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ ఉందో? లేదో? తెలియడం కోసం ఒకసారి సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు మీ అమ్మాయి మానసిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇస్తారు. ఆమెకు మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని