ఇలా చేస్తే ఆ ఇబ్బంది ఉండదు!

నెలనెలా నెలసరి సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. వంటివి అందులో కొన్ని. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం....

Published : 17 Apr 2023 20:32 IST

నెలనెలా నెలసరి సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. వంటివి అందులో కొన్ని. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ మాత్రలతో పని లేకుండా ఈ సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

వేడి నీళ్ల బాటిల్‌తో..

నెలసరి సమయంలో చాలామందికి పొత్తి కడుపులో నొప్పి రావడం తెలిసిందే. ఈ నొప్పిని భరించలేక కొంతమంది పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి తరచూ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాత్రలకు బదులు హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్ల బాటిల్‌తో మీరే స్వయంగా మీ నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఒక బాటిల్‌లో కాస్త వేడిగా ఉన్న నీటిని నింపి దాని చుట్టూ ఒక కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. ఈ బాటిల్‌తో నొప్పి ఉన్న కాపడం పెడితే.. త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కాస్త గోరువెచ్చటి నీటితో స్నానం చేసినా మనసుకు ప్రశాంతంగా అనిపించి హాయిగా నిద్రపడుతుంది.

మసాజ్ మంచిదే..

నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, ఇతర ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి అత్యవసర నూనెలు ఎంతగానో తోడ్పడతాయి. ఇందుకోసం నొప్పి వచ్చే చోట పెప్పర్‌మెంట్, రోజ్‌మేరీ, లావెండర్.. ఇలా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్‌తో కాస్త మర్దనా చేస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. మీకు మీరు చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. భాగస్వామితో లేదంటే నిపుణులతో చేయించుకోవచ్చు. పిరియడ్స్ సమయంలో సౌకర్యవంతంగా ఉండడానికి ఇది కూడా చక్కటి మార్గమే.

ఈ ఆహారం..

నెలసరి సమయంలో చింత లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం క్యాల్షియం విరివిగా లభించే పాలు, పాల పదార్థాలు, పాలకూర.. వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు మూడ్ స్వింగ్స్, ఆహారం ఎక్కువగా తినాలన్న కోరికను అదుపు చేయడంలో తోడ్పడతాయి. అలాగే సాయంత్రం స్నాక్స్ సమయంలో నూనె పదార్థాలు కాకుండా.. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభించే నట్స్, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై మనసును ఉత్తేజపరుస్తాయి.

అంతేకాదు.. ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీళ్లు తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల శరీరంలో నొప్పి ఉన్న కండరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా దోస.. వంటి పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.

కాస్త పని చెప్పాలి..

నెలసరి సమయంలో ఇంట్లో ఏదైనా పనిచేసుకుందామంటేనే కొందరికి శరీరం సహకరించదు. అలసట, చికాకుగా అనిపించి ఎప్పుడెప్పుడు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తుంటుంది. కానీ ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం.. వంటివి చేయడం చాలా మంచిది. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు పిరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్.. తదితర సమస్యల నుంచి విముక్తి పొందచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఎంచుకునే వ్యాయామాలు పొత్తి కడుపు, నడుముపై ఒత్తిడి పడకుండా ఉండేలా జాగ్రత్తపడడం మంచిదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని