జంక్‌ ఫుడ్స్‌ మానలేకపోతున్నారా?

కొంతమందికి కడుపు నిండా ఆహారం తీసుకున్నా జంక్‌ ఫుడ్స్‌పైకి మనసు లాగుతుంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.

Published : 04 Dec 2023 12:36 IST

కొంతమందికి కడుపు నిండా ఆహారం తీసుకున్నా జంక్‌ ఫుడ్స్‌పైకి మనసు లాగుతుంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

ఊబకాయం తప్పదు!

సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు ఈ తరహా ఆహారపు కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే మూడ్‌ స్వింగ్స్‌, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా దీనికి కారణమవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు, క్యాలరీలు పెరిగిపోతాయి. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయానికి దారితీస్తాయి. పైగా గర్భిణులు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తల్లీబిడ్డలిద్దరికీ మంచిది కాదు. కాబట్టి ఈ ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి..

నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయంటున్నారు నిపుణులు. అదేవిధంగా శరీరం తేమను కోల్పోకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

ఎక్కువ గ్యాప్‌ ఇవ్వద్దు!

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వద్దు. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తినడం వల్ల చిరుతిండ్లపైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే మధ్యమధ్యలో బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పులు, పండ్లు.. వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవాలి.

బాగా నమిలి మింగండి!

ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో చూయింగ్‌ గమ్‌ కూడా సమర్థంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

భోజనం మానద్దు!

చాలామంది వివిధ పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోతుంటారు. ఇక ఆకలేసినప్పుడు అందుబాటులో ఉన్న పదార్థాలతో ఆకలిని తీర్చుకుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. కాబట్టి సరైన సమయంలోనే ఆహారం తీసుకోవడం వల్ల జంక్‌ఫుడ్స్‌కి దూరంగా ఉండచ్చంటున్నారు.

ప్రొటీన్లు బాగా తీసుకోవాలి!

కార్బోహైడ్రేట్లతో పోల్చితే ప్రొటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, నట్స్‌.. వంటివి తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇతర ఆహార పదార్థాల పైకి మనసు మళ్లదు.

వీటితో పాటు కంటి నిండా నిద్ర, ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, ధ్యానం, ఇతర వ్యాయామాలు చేయడం.. వల్ల కూడా ఆహారపు కోరికల్ని అదుపు చేసుకోవచ్చు. ఫలితంగా జంక్‌ఫుడ్స్‌పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్