శిలాజ ఇంధనాల వినియోగంపై చిక్కుముడి

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరుగుతున్న కాప్‌28 సదస్సు శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పే విషయమై సోమవారం ఉదయానికి కూడా ఏకాభిప్రాయం సాధించలేకపోయింది.

Published : 12 Dec 2023 04:53 IST

 కాప్‌28లో కుదరని ఏకాభిప్రాయం

దుబాయ్‌: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరుగుతున్న కాప్‌28 సదస్సు శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పే విషయమై సోమవారం ఉదయానికి కూడా ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. పారిశ్రామిక విప్లవం ముందునాళ్లతో పోలిస్తే నేడు భూగోళంపై సగటు ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఈ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద పట్టి నిలపాలంటే చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని ప్రపంచం ఘోషిస్తోంది. దుబాయ్‌ సదస్సు ఈ మేరకు తీర్మానిస్తే తప్ప సదస్సు విజయవంతమైనట్లు కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సోమవారం ఉద్ఘాటించారు. సమస్యను వాయిదా వేస్తూ కూర్చుంటే కుదరదనీ, భూతాప నిరోధానికి ఇప్పటికే సమయం మించిపోతోందన్నారు. చిన్నచిన్న ద్వీప దేశాలు, ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని కోరుతున్నాయి. ఆ మేరకు కాప్‌ 28 సదస్సు  తీర్మానించాలని ఆశిస్తున్నాయి. కానీ సంయుక్త ప్రకటనలో అసలు శిలాజ ఇంధనాలు అనే పదమే వాడరాదని సౌదీ అరేబియా భావిస్తోంది. ఈ విషయంలో ఇతర చమురు ఉత్పత్తి చేసే దేశాలనూ కలుపుకొనిపోతోంది. అసలు ఈ అంశంపై చర్చించడానికే ఒపెక్‌ దేశాలు ఇష్టపడటం లేదు. అసలు అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియాలే శిలాజ ఇంధనాలకు మంగళం పాడటానికి అడ్డుపడుతున్నాయని పసిఫిక్‌ వాతావరణ ఉద్యమకారుడు జోసెఫ్‌ సికులు విమర్శించారు. గుటెరస్‌  పాత్రికేయులతో సమావేశమవుతుండగా, వెలుపల సికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బొగ్గుతోపాటు అన్ని శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని భారత్‌ 2022లోనే ప్రతిపాదించినా ఆ ఏటి కాప్‌ ఎజెండాలో సదరు అంశాన్ని చేర్చలేదు. ఈ సంవత్సర అజెండాలో భారత్‌ ప్రతిపాదనే ప్రధాన అంశమైనా, దానిపై పురోగతి లేకపోవడం శోచనీయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని