ముందు జాగ్రత్తల్లో డ్రాగన్‌!

చైనా గత అనుభవాల దృష్ట్యా సరిహద్దు ప్రాంతంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద కొన్ని నిర్మాణాలు చేపడుతోంది. డోక్లాం

Published : 01 Sep 2022 03:04 IST

పాంగాంగ్‌ వద్ద రాడోమ్‌లు, భారీ వంతెన నిర్మాణం

చైనా గత అనుభవాల దృష్ట్యా సరిహద్దు ప్రాంతంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద కొన్ని నిర్మాణాలు చేపడుతోంది. డోక్లాం వద్ద భారత్‌తో సైనిక సంక్షోభం తలెత్తాక చైనా అక్కడ ఓ గ్రామాన్ని, ఇతర నిర్మాణాలను చేపట్టింది. గతంలో డ్రాగన్‌ ఈ సరస్సు ఉత్తరం వైపు భారత్‌ భూభాగాల్లో చొరబడి తిష్ఠ వేసినప్పుడు.. భారత సైన్యం మెరుపువేగంతో ఆపరేషన్‌ నిర్వహించి దక్షిణం వైపున కైలాస్‌ రేంజిలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకొని మాల్డో గారిసన్‌పై గురిపెట్టింది. దీంతో చర్చల అనంతరం చైనా ఉత్తరం వైపు భూభాగాలను ఖాళీ చేసింది. భారత్‌ కూడా కైలాస్‌ రేంజి నుంచి వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో చైనా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

* పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా రాడోమ్‌లను నిర్మిస్తోంది. వాతావరణ మార్పుల నుంచి రాడార్లను రక్షించేందుకు నిర్మించే డోమ్‌ వంటి నిర్మాణాలను రాడోమ్‌లు అంటారు. వివాదాస్పదమైన ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 మధ్యలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపగ్రహ చిత్ర నిపుణుడు డామియన్‌ సైమన్‌ ‘డెట్రెస్‌ఫా’ పేరిట నిర్వహించే ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇక్కడకు సమీపంలోనే సోలార్‌ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సరస్సు, దాని చుట్టుపక్కల శిఖరాలపై పూర్తిగా నిఘా పెట్టవచ్చు.

* డ్రాగన్‌ 1958లో స్వాధీనం చేసుకొన్న ఖుర్నాక్‌ ఫోర్టు ప్రాంతాన్ని బాగా వాడుకుంటోంది. పాంగాంగ్‌ సరస్సులోని ఉత్తర-దక్షిణ తీరాల మధ్య ఇక్కడ కేవలం 500 మీటర్ల దూరమే ఉంటుంది. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ప్రాంతంలో భారీ వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్‌, సిరిజాప్‌లలోని స్థావరాల నుంచి వేగంగా సాయం అందించడానికి వీలవుతుంది. సైనిక దళాల ప్రయాణ దూరం కూడా 180 నుంచి 50 కి.మీ.లకు తగ్గిపోతుంది. భారీ సైనిక వాహనాలను దీనిపై తరలించేందుకు వీలుగా ఈ వంతెన నిర్మాణం జరుగుతున్నట్లు ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది.

ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లను మోహరించిన భారత్‌..

దాడికి ఉపయోగించే ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ వాహనాలను ఈ సరస్సులో భారత్‌ గత వారమే మోహరించింది. అత్యవసర సమయాల్లో వేగంగా దాడి చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వాహనాలను గోవాలోని అక్వేరియస్‌ షిప్‌యార్డ్‌లో నిర్మించారు.

- ఈనాడు, ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని