Afghanistan : తాలిబన్ల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యూటీషియన్ల నిరసన.. గాల్లోకి కాల్పులు జరిపి అణచివేత

అఫ్గాన్‌లో (Afghanistan) తాలిబన్ల (Taliban) ఉత్తర్వులపై కొందరు బ్యూటీషియన్లు నిరసన తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేని తాలిబన్‌ సేనలు వారిని చెదరగొట్టాయి. 

Published : 20 Jul 2023 01:40 IST

కాబుల్ : అఫ్గాన్‌ (Afghanistan) రాజధాని కాబుల్‌లో (Kabul) బ్యూటీషియన్లు ఆందోళన నిర్వహించారు. బ్యూటీ పార్లర్‌లపై తాలిబన్లు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ పదుల సంఖ్యలో గుమిగూడారు. జీవనోపాధిని దూరం చేసి తమ పొట్ట కొట్టొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్లూటీ పార్లర్‌లు ఎక్కువగా ఉండే బుచెర్‌ స్ట్రీట్‌లో ఈ ఆందోళనలు చేశారు. దాంతో తాలిబన్‌ సేనలు అప్రమత్తమయ్యాయి. వెంటనే వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలను మహిళలు కొందరు విలేకరులకు పంపించారు.

‘ఇవాళ మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి శాంతియుతంగా నిరసన చేపట్టాం. అయితే మాతో మాట్లాడటానికి ఎవరూ రాలేదు. మా గోడు వినలేదు. పైగా జల ఫిరంగులు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారని’ ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు మీడియాతో అన్నారు. అఫ్గాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు స్త్రీలపై అనేక నిషేధాలు విధించారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సీటీల వరకు వారిని చదువుకు దూరం చేశారు. పార్క్‌లు, ఎగ్జిబిషన్లు, జిమ్‌లో సైతం మహిళలు అడుగుపెట్టకూడదంటూ ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా ముసుగు ధరించాలని ఆదేశించారు.

శక్తిమంతమైన పాస్‌పోర్టు జాబితాలో అగ్రస్థానంలో సింగపూర్‌.. మరి భారత్‌ స్థానం..?

గత నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్‌లను మూసివేయాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆదేశించింది. నెలలోగా మిగిలిన ఉత్పత్తులను ఖాళీ చేసుకొని దుకాణాలను మూసేయాలని హుకుం జారీ చేసింది. బ్యూటీ పార్లర్‌ల కారణంగా  పేద కుటుంబాల్లోని మహిళలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వుల వెనుక తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హిబతుల్లా అఖుంద్జాదా ఉన్నట్లు సమాచారం. కాందహార్‌లో నివసించే అతడు చాలా అరుదుగా బయట కన్పిస్తాడు.

ఈ వివక్షల గురించి రిచర్డ్ బెన్నెట్‌ అనే రిపోర్టర్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి నివేదిక పంపించారు. ఈ దేశంలో మహిళలు, బాలికల దుస్థితి ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు. తాలిబన్ల పాలనలో స్త్రీలపై తీవ్రమైన వివక్ష సాగుతోందని ఫిర్యాదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని