Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్‌

ఇరాన్‌- ఇరాక్‌ యుద్ధ వార్షికోత్సవం పురస్కరించుకుని ఇరాన్‌ సేనలు పెద్దఎత్తున ఆయుధ సంపత్తితో మిలటరీ పరేడ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించగల డ్రోన్లను ప్రదర్శించాయి.

Published : 23 Sep 2023 01:48 IST

టెహ్రాన్‌: ఇరాన్‌- ఇరాక్‌ యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టెహ్రాన్‌ భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇరాన్‌ సేనలు పెద్దఎత్తున ఆయుధ సంపత్తితో కదం తొక్కాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించగల డ్రోన్లను ప్రదర్శించాయి. వాటితోపాటు బాలిస్టిక్‌, హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరేడ్‌లో భాగం చేసినట్లు ఇరాన్‌ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కవాతులో ప్రదర్శించిన డ్రోన్‌లకు మొహజర్‌, షాహెద్‌, అరాష్‌ అని పేర్లు పెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సైన్యాన్ని ఉద్దేశించి ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రసంగించారు.

భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్‌

‘మన దళాలు ఇరాన్‌తోపాటు పర్షియన్‌ గల్ఫ్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులకు దీటుగా ప్రతిఘటించడమే ప్రస్తుత కాలపు తంత్రమని ఈ ప్రాంత ప్రజలకు మనం చాటగలం. లొంగిపోవడమో.. తడబడటమో కాదు.. శత్రువును తోకముడిచేలా చేయగలిగేది ప్రతిఘటన మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. మొహజర్‌-10 పేరుతో ఓ అత్యాధునిక డ్రోన్‌ను రూపొందించినట్లు ఇరాన్‌ గత నెలలో వెల్లడించింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, 24 గంటలపాటు నిరంతరాయంగా గాల్లో చక్కర్లు కొట్టడం, 300 కిలోల పేలోడ్ మోసుకెళ్లడం వంటి సామర్థ్యాలు దీని సొంతమని తెలిపింది. సుమారు 24 గంటలు ప్రయాణించి 2వేల కిలోమీటర్ల దూరానికి వెళ్లగలదని పేర్కొంది. మొహజర్‌-6తో పోలిస్తే ఇందులో రెట్టింపు సామర్థ్యాలున్నాయి.

1980 సెప్టెంబరు 22న అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సేనలు ఇరాన్‌పై దండెత్తడంతో ఇరాన్- ఇరాక్ యుద్ధం మొదలైంది. ఎనిమిదేళ్లపాటు సాగిన ఈ సైనిక సంఘర్షణలో రెండువైపులా దాదాపు 5 లక్షల మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని