Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్‌

అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (UNSC).. ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించడంలో అలసత్వం వహిస్తోందని భారత్‌ పేర్కొంది.

Updated : 22 Sep 2023 19:00 IST

ఐరాస: ఏడాదిన్నర పూర్తయినా.. ఉక్రెయిన్‌ సంక్షోభం (Ukraine Crisis) మాత్రం కొలిక్కి రాలేదు. దీనిపై భారత్‌ తాజాగా తన గళాన్ని గట్టిగా వినిపించింది. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC).. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో ఎందుకు సమర్థవంతంగా పని చేయడం లేదని ప్రశ్నించింది. తాజాగా ప్రారంభమైన ఐరాస భద్రతా మండలి సమావేశాల్లో మాట్లాడిన భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సంజయ్‌ వర్మ.. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా లేవనెత్తాలన్నారు.

‘ప్రస్తుత తరుణంలో మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఉక్రెయిన్‌- రష్యా వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి సమీపంలో ఉన్నామా..? లేకపోతే.. అటువంటప్పుడు ఈ ఐరాస, భద్రతామండలి వ్యవస్థ (UNSC) ఎందుకు..? ఈ సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవడంలో అసమర్థత ఉన్నట్లే కదా’ అని విదేశాంగ కార్యదర్శి సంజయ్‌ వర్మ పేర్కొన్నారు. ఈ సంక్షోభం వల్ల ఆహార ధరలు, ఇంధనం, ఎరువుల ధరలు పెరగడం వంటి పర్యవసానాలను చూస్తున్నామని.. వీటితో అత్యంత ప్రభావితమవుతోన్న గ్లోబల్‌ సౌత్‌ (Global South) గళాన్ని వినడం ఎంతో ముఖ్యమన్నారు.

భారత్‌-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?

‘భిన్న దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలంటే.. కాలం చెల్లిన విధానాలను సంస్కరించాల్సిందే. లేదంటే వాటిపై విశ్వసనీయత క్షీణిస్తూనే ఉంటుంది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుంటే.. ఎప్పుడూ ఆశావహులుగానే మిగిలిపోతాం’ అని సంజయ్‌ వర్మ వెల్లడించారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత వైఖరిని మరోసారి స్పష్టం చేసిన ఆయన.. దీనిపై భారత్‌ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. శత్రుత్వాలను తగ్గించుకొని పోరాటానికి ముగింపు పలికేందుకు యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు కృషి చేయాలన్నారు. ఇందుకు చర్చలు మాత్రమే పరిష్కార మార్గమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని