Joe Biden: నాలుగు రోజులు కూడా నిలవని సఖ్యత.. జిన్‌పింగ్‌ను నియంతతో పోల్చిన బైడెన్‌

అమెరికా-చైనా మధ్య సఖ్యత కోసం ప్రయత్నాలు జరిగిన కొద్ది రోజుల్లోనే మళ్లీ పరస్పర విమర్శల పర్వం మొదలైంది.   

Updated : 21 Jun 2023 11:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)-చైనా(China) మధ్య ఆదివారం కుదిరిన సఖ్యత రోజుల్లోనే మాయమైపోయింది. ఇరు దేశాల నేతలు పరస్పరం నిందించుకొంటున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌(Joe Biden) మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)ను నియంతగా అభివర్ణించారు. అంతేకాదు.. ఈ ఏడాది మొదట్లో నిఘా బెలూన్‌ను పేల్చివేసిన సమయంలో ఆయన ఇబ్బంది పడ్డాడని బైడెన్‌ వెల్లడించారు. చైనాతో సంబంధాలను కుదట పర్చేందుకు అమెరికా విదేశాంగ మంత్రి  బ్లింకెన్‌ బీజింగ్‌లో పర్యటించిన రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఈ ఏడాది రెండు కార్ల సైజులోని నిఘా పరికరాలతో ఉన్న బెలూన్‌ను పేల్చి వేయించాను. ఆ సమయంలో ఆయన ఇబ్బంది పడ్డారు. అది(బెలూను) వెళ్లాల్సిన చోటుకు వెళ్లలేదు.. దారి తప్పింది. అది అక్కడ ఉందని ఆయనకు తెలియదు. ఏం జరుగుతోందో వారు తెలుసుకోలేని స్థితిలో ఉంటే.. ఇలాంటివి నియంతలకు పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మారతాయి’’ అని బైడెన్‌ కాలిఫోర్నియాలో జరిగిన నిధుల సేకరణ కార్యాక్రమంలో పేర్కొన్నారు. చైనా ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని వెల్లడించారు.

అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ సోమవారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పోటీ వివాదంగా మారకుండా చూసుకోవాలని నిర్ణయించారు. ఈ పర్యటనపై బైడెన్‌ నిన్న మాట్లాడుతూ.. ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. బ్లింకన్‌ పర్యటనలో ఇరు దేశాల సంబంధాల మధ్య పురోగతి కనిపించిందన్నారు. కానీ, చైనా నుంచి మాత్రం ప్రతికూల ప్రకటన వచ్చింది. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై చైనా అక్కసు వెళ్లగక్కింది. బీజింగ్‌కు వ్యతిరేకంగా న్యూదిల్లీని ఒక అడ్డుగోడలా ఉపయోగించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోందని తీవ్ర పదజాలం ఉపయోగించింది. ఈ మేరకు గ్లోబల్‌ టైమ్స్ పత్రికలో చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ ఈ ఒక వ్యాసం రాసుకొచ్చారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఓ నియంతతో పోలుస్తూ జోబైడెన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని