Biden-Jinping: ‘మా కారు చూశారా..?’: బైడెన్‌-జిన్‌పింగ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

Biden-Jinping: అమెరికా-చైనా అధినేతలు బైడెన్‌, జిన్‌పింగ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వీరిద్దరూ తమ తమ కార్ల గురించి పరస్పరం మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 17 Nov 2023 18:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), చైనా (China) అధినేత షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) ఇటీవల తొలిసారి భేటీ అయిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు వెళ్లిన జిన్‌పింగ్‌.. శాన్‌ఫ్రాన్సిస్కోలో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల వంటి కీలక అంశాలపై దేశాధినేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వీరి మధ్య మరో ఆసక్తికర సంభాషణ జరిగింది. అధినేతలిద్దరూ తమ కార్ల గురించి మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందంటే..?

సమావేశం అనంతరం జిన్‌పింగ్‌కు వీడ్కోలు పలికేందుకు బైడెన్‌ ఆయన కారు వద్ద వరకు వెళ్లారు. చైనా అధినేత సాయుధ కారు హాంగ్‌కీ ఎన్‌701 లిమోను చూసిన బైడెన్‌ ‘చాలా అందంగా ఉంది’ అని చెప్పారు. దీనికి జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. ‘ఇది మేడ్‌ ఇన్‌ చైనా సెడాన్‌. డోర్‌ తీసి అధ్యక్షుడికి మన కారును చూపించండి’ అని తన సిబ్బందికి సూచించారు.

జిన్‌పింగ్‌ కారును పరిశీలించిన అనంతరం బైడెన్‌ తన వాహనం గురించి చైనా అధ్యక్షుడికి చెప్పారు. ‘‘మాది కాడిల్లాక్‌ కార్‌. కదిలే బంకర్‌లా దాన్ని రూపొందించారు. ఆ కారును ఏమని పిలుస్తారో తెలుసా? ‘ది బీస్ట్‌’ అంటారు’’ అని అగ్రరాజ్య అధినేత తన వాహనం గురించి గర్వంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

ఇక, ఈ సంభాషణకు ముందు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ‘‘మన రెండు దేశాల బంధం కొనసాగాలి’’ అని బైడెన్‌కు తెలిపారు. దీనికి అమెరికా అధినేత అంగీకరిస్తూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు చేయి ముందుకు చాచారు. అయితే జిన్‌పింగ్‌ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లడం ఈ వీడియోలో కన్పించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని