Libya: ఘోర ప్రమాదం.. పడవ మునిగి 60 మందికి పైగా మృతి..!

Libya: మధ్యధరా సముద్రంలోని ఓ మార్గం ద్వారా వలసదారులు అక్రమంగా ఐరోపా దేశాల్లోకి చొరబడుతుంటారు. అయితే, ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఏటా అనేక మంది మృతి చెందుతున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో డజన్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

Updated : 17 Dec 2023 15:59 IST

ట్రిపోలి (లిబియా): డజన్ల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా (Libya) తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించినట్లు ఐరాసకు చెందిన ‘ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (IOM)’ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.

తాజా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. 

యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేలాది మంది ఐరోపాకు వలసపోతున్నారు. వారికి లిబియా (Libya) ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. దశాబ్దాల పాటు పాలించిన నియంత గడాఫీ మరణం తర్వాత ఈ దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక్కడి భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవటంతో ఐరోపాకు చేరుకోవాలనుకుంటున్న వారంతా ఈ దేశ తీరం నుంచే బయల్దేరుతున్నారు. ఐఓఎం అధికార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2,250 మంది మరణించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మానవ అక్రమ రవాణాదారులకు లిబియాలోని కల్లోల పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. వీరందరినీ ప్రమాదకరమైన పడవల్లో కుక్కి తీరం దాటిస్తుంటారు. ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే.. వారిని ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో ఉంచుతున్నారు. వీరిని నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. అలాగే వీరిపై అత్యాచారం వంటి ఘోరాలు జరుగుతున్నాయి. పైగా దేశాన్ని విడిచి వెళ్లేటప్పుడు వారి  వద్ద ఉన్న డబ్బు లాక్కుంటున్నట్లు ఐరాస నియమించిన అధికారుల బృందం గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని