జెలెన్‌స్కీకి మోదీ ఫోన్‌.. రష్యా గురించి స్పందించిన అమెరికా..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి భారత ప్రధాని మోదీ ఫోన్ చేయడంపై అగ్రదేశం అమెరికా స్పందించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత ఒంటరి అవుతున్నారనేదానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది. 

Published : 06 Oct 2022 01:48 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయ సమాజం నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరింత ఒంటరి అవుతున్నారని అగ్రదేశం అమెరికా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ కాల్‌ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మంగళవారం జెలెన్‌స్కీకి ఫోన్ చేసిన మోదీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనిక పరమైన పరిష్కారం లేదన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకడానికి ప్రయత్నం జరగాలని ఇది వరకే తాను పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. శాంతిని నెలకొల్పే ఎలాంటి చర్యల్లోనైనా సాయపడేందుకు భారత్‌ సిద్ధమని తెలిపారు.

దీనిపై శ్వేతసౌధ ప్రెస్ సెక్రటరీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ యుద్ధంపై బహిరంగంగా స్పందించాలని, దౌత్యపరంగా చర్చించాలని ప్రపంచ దేశాలను మేం కోరుతూనే ఉన్నాం. ఇప్పుడు భారత ప్రధాని నుంచి వచ్చిన స్పందన ఆ తరహాలోనిదే అని మేం భావిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే భారత ప్రధాని ఇటీవల పుతిన్‌తో జరిపిన చర్చ గురించీ మాట్లాడారు. ‘పుతిన్‌తో భారత ప్రధాని నేరుగా చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. ఇది పుతిన్‌ యుద్ధమని పరోక్షంగా ప్రస్తావించారు కూడా. అంతర్జాతీయ సమాజం నుంచి రష్యా అధ్యక్షుడు మరింత ఒంటరవుతున్నారు. అలాగే రష్యా చేస్తున్న అణు హెచ్చరికలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. అయితే, ఆ దేశం అతి త్వరలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధమవుతోందన్న సూచనలేవీ లేవు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని