Adani Group: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ FPOపై సెబీ నిఘా?

Adani Group: ఎఫ్‌పీఓలో పాల్గొనే యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దు. ఈ నేపథ్యంలో ‘అదానీ’ ఎఫ్‌పీఓలో ఈ నిబంధనేమైనా ఉల్లంఘనకు గురైందా అనే కోణంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Published : 10 Feb 2023 18:27 IST

దిల్లీ: మధ్యలోనే ఆగిపోయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ (Adani Enterprises FPO)పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో పాల్గొన్న ఇన్వెస్టర్లపై సెబీ (SEBI) దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. ఇటు అదానీ గ్రూప్‌ (Adani Group)గానీ, సెబీగానీ దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఎఫ్‌పీఓలో పాల్గొనే యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దన్నది నిబంధన. ఈ నేపథ్యంలో అదానీ ఎఫ్‌పీఓ (Adani Enterprises FPO)లో ఈ నిబంధనేమైనా ఉల్లంఘనకు గురైందా? అనే కోణంలో సెబీ (SEBI) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎఫ్‌పీఓ (Adani Enterprises FPO)లో షేర్లను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న మరో రెండు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలతో అదానీ గ్రూప్‌ (Adani Group)నకు ఉన్న సంబంధాలపైనా సెబీ (SEBI) గురిపెట్టినట్లు తెలుస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) రూ.20,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎఫ్‌పీఓను ప్రారంభించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక (Hindenburg Report).. ఫలితంగా గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం నేపథ్యంలో తొలి రెండురోజుల్లో పెద్దగా స్పందన లభించలేదు. కానీ, చివరి రోజు మాత్రం అన్ని షేర్లు సబ్‌స్క్రైబ్‌ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే, ఎఫ్‌పీఓను గట్టెక్కించేందుకు కొన్ని సంస్థలు అదానీ గ్రూప్‌ (Adani Group)నకు అండగా నిలిచాయనే వార్తలు వచ్చాయి.

4 కంపెనీ రేటింగ్స్‌లో మూడీస్‌ కోత..

అదానీ గ్రూప్‌ (Adani Group)లోని నాలుగు కంపెనీల రేటింగ్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సవరించింది. స్టేబుల్‌ నుంచి నెగెటివ్‌కు మార్చినట్లు వెల్లడించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్‌ గ్రూప్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టెప్‌-వన్‌ లిమిటెడ్‌, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్‌ రేటింగ్‌ ఔట్‌లుక్‌ను మార్చినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీ ఈక్విటీ విలువలు భారీగా పడిపోయిన నేపథ్యంలోనే మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని