USA: ముగ్గురు సైనికుల మృతి.. ప్రతీకార దాడులు మొదలు పెట్టిన అమెరికా

ఇటీవల జోర్డాన్‌లో అమెరికా సైనికులపై జరిగిన డ్రోన్‌ దాడికి సంబంధించి అమెరికా ప్రతికార దాడులు మొదలుపెట్టింది.  

Updated : 03 Feb 2024 06:46 IST

వాషింగ్టన్‌: ఇటీవల జోర్డాన్‌ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా (USA) ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడి చేశాయి. ఈఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జోర్డాన్‌లో ఇటీవల అమెరికా సైనిక క్యాంప్‌పై డ్రోన్‌ దాడి జరగడంతో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు. దీంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు జోబైడెన్‌తో ఇతర మంత్రులు ప్రతికార దాడులు తప్పవని హెచ్చరించారు. దానికి తగ్గట్లు ప్రణాళిక రూపొందిస్తాన్నామని బైడెన్‌ ఇటీవల పేర్కొన్నారు.  

డ్రోన్‌ దాడిలో మృతిచెందిన సైనికుల కుటుంబాలను బైడెన్‌ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. ‘‘నా ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్‌, సిరాయాల్లోని శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాయి. మా స్పందన మొదలైంది. మేము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగాయి. దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని