Zelenskyy: సొంత సైనికుల మృతదేహాలనే వదిలేస్తోంది.. ఇంతకంటే దారుణం ఉంటుందా..?

ఉక్రెయిన్‌పై రష్యా పోరుకు నెల రోజులు దాటేసింది. ఈ సమయంలో ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. రష్యా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్‌ ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తోంది.

Updated : 28 Mar 2022 13:42 IST

రష్యాపై జెలెన్‌స్కీ ఆగ్రహం

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా పోరు నెల రోజులు దాటింది. ఇరువైపులా ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. రష్యా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్‌ ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తోంది. ఆ దేశం యుద్ధంలో చనిపోయిన తమ సొంత సైనికుల మృతదేహాలనూ గాలికి వదిలేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. 

‘ఇది చాలా భయానకంగా ఉంది. సొంతవారిపట్లే అలా ప్రవర్తిస్తే.. బయటివారిని ఇంకెలా చూస్తారు? ఇది పూర్తిగా అనాగరికం. ఈ సైనికుల మృతదేహాలను వదిలేస్తున్నారు. లేకపోతే చెత్త సంచుల్లో ఇంటికి తీసుకెళ్తున్నారు’ అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ రష్యా వైఖరిని నిరసించారు. మృతుల పట్ల రష్యా అధికార వర్గాలు వ్యవహరిస్తోన్న తీరును అక్కడి సైనిక కుటుంబాలు ఎందుకు అంగీకరిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. 

అలాగే అసలు ఉక్రెయిన్‌పై రష్యా ఎందుకు యుద్ధం చేస్తోందని ప్రశ్నించారు. ‘ఉక్రెయిన్‌లో మేం దేనికోసం పోరాడుతున్నామో అర్థం చేసుకున్నాం. మరి మీ సంగతి ఏంటి..? మీ దేశంలో ఏం జరుగుతోంది? నాకు అర్థం కావడం లేదు. ఇదొక విషాదం’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్‌ తటస్థత కోసం రష్యా చేసిన డిమాండ్‌ను తమ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందన్నారు.  

రష్యా జరుపుతోన్న ఈ దురాక్రమణలో వెయ్యిమందికి పైగా ఉక్రెయిన్‌ పౌరులు మరణించారని, పదిహేడు వందల మందికి పైగా గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ఎవ్వరూ ఊహించని విధంగా సుదీర్ఘంగా సాగుతోన్న ఈ యుద్ధం కారణంగా కోటి మందికి పైగా తమ సొంతప్రాంతాలను వీడినట్లు అంచనా. ఈ సైనిక పోరు ముగింపు కోసం ఇప్పటికే ఇరు దేశాలు పలుమార్లు చర్చలు జరిపాయి. అయినా ఆశించిన ఫలితం రాలేదు. తాజాగా టర్కీలో మరోదఫా చర్చలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని