సినిమాల నుంచి వచ్చి.. పతకం గెలిచి!
 
యూత్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రజతం గెలిచిన సిమ్రన్‌ది భిన్నమైన నేపథ్యం. హరియాణాలోని జాజర్‌కు చెందిన సిమ్రన్‌కు చిన్నప్పటి నుంచి కుస్తీ అంటే చాలా ఇష్టం. నాన్న అహ్లావత్ జాతీయ స్థాయి రెజ్లర్ కావడంతో తానూ అతడి బాటలోనే నడవాలనుకుంది. కుస్తీ కోసం 2014లో సిమ్రన్ను తీసుకుని దిల్లీకి వచ్చాడు ఆమె నాన్న. అయితే రెజ్లింగ్ కన్నా ముందు జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ ప్రయత్నించింది సిమ్రన్. కానీ తనకు కుస్తీయే సరైందని భావించి మళ్లీ ఈ ఆటలోకి వచ్చింది. అమ్మాయికి కుస్తీ ఏంటి అని ఊళ్లో వాళ్లు విమర్శించారు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ కోసం సిమ్రన్‌కు భాగస్వామి కూడా దొరికేవారు కాదు. అబ్బాయిలకు రూ.500 ఇచ్చి వాళ్లతో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. 2014 జాతీయ జూనియర్ రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణం గెలవడం సిమ్రన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటింది. దిగ్గజ రెజ్లర్ సుశీల్ సలహాలు ఆమెకెంతగానో ఉపయోగపడ్డాయి. రెజ్లింగ్ చేస్తూనే సిమ్రన్ సినిమాల్లోనూ నటించడం విశేషం. మొదట కుస్తీ నేపథ్యంలో సాగే ‘దంగల్’ సినిమాలో రెజ్లర్‌గా నటించిన సిమ్రన్.. ఆ తర్వాత అలాంటి కథతోనే వచ్చిన ‘సుల్తాన్’లోనూ ఒక పాత్ర చేసింది. దంగల్ సినిమా చేస్తున్నప్పుడే ఆమె ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడి స్వర్ణం సాధించడం విశేషం. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్నది సిమ్రన్ కల.

|
రాకెట్ దూసుకొస్తోంది
భారత బ్యాడ్మింటన్ అనగానే చాలా ఏళ్లుగా సైనా, సింధు, శ్రీకాంత్ లాంటి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ల తర్వాతి తరంలో ఆ స్థాయిలో రాణించగల సత్తా ఉన్న షట్లర్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా నేనున్నానంటూ దూసుకొచ్చాడు లక్ష్యసేన్. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన లక్ష్యసేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనె అకాడమీలో విమల్‌కుమార్ శిక్షణలో రాటుదేలాడు. తన అన్న చిరాగ్సేన్తో కలిసి ఈ అకాడమీలో అతను శిక్షణ పొందాడు. 2016లో తొలిసారి ఈ కుర్రాడు జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. స్థిరంగా రాణిస్తూ, వరుస విజయాలు సాధించిన లక్ష్య.. 2016 జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయ్యాడు. ఈ ఏడాది ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్రపంచ నంబర్-1 కున్లావత్కు షాకిచ్చాడు. అంతేకాదు ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో చైనా దిగ్గజం లిన్ డాన్‌కు చెమటలు పట్టించాడు. మధ్యలో భుజం గాయం ఇబ్బంది పెట్టినా.. యూత్ ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 69వ స్థానంలో ఉన్న లక్ష్య.. టాప్-20లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘‘లక్ష్యసేన్ నెట్‌గేమ్, కోర్టులో అతని వేగం, ర్యాలీలు పదుకొనేను గుర్తు చేస్తాయి. కచ్చితంగా అతను పెద్ద స్థాయికి చేరతాడు’’ అని విమల్‌కుమార్ చెప్పాడు.
|