
వార్తలు / కథనాలు
గతంలో మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ను గుర్తింపు
గంటకు 750 మందిని స్క్రీనింగ్ చేయగల సామర్థ్యం!
మనిషి మచ్చిక చేసుకున్న జంతువుల్లో శునకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా ఇళ్లల్లో వీటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. భారత్‌లాంటి దేశాల్లో కాలభైరవ స్వరూపంగా ఆరాధిస్తారు. కాలం గడిచే కొద్దీ శునకాలు మనుషుల్ని ఎంత ప్రేమిస్తాయో? ఎంత విశ్వాసం చూపిస్తాయో? ఎలా రక్షిస్తాయో ప్రత్యక్షంగా చూశాం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా వైరస్. మరి ఈ మహమ్మారి నుంచి బయట పడేందుకు శునకాలేమైనా సహాయం చేయగలవా?
పరీక్షలకు శునక సాయం
ఒక వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నమూనాలను పరీక్షించడం. వైరస్ సోకిన 20% మందిలోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. అందులోనూ తీవ్రత ఎక్కువుంటేనే ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం వంటివి తెలుస్తున్నాయి. మిగతా 80% మందిలో లక్షణాలేమీ కనిపించడం లేదు. అంటే వీరు గుప్త వాహకులుగా మారే ప్రమాదముంది. వైరస్ లేదని బయటే తిరిగితే వారి నుంచి ఇతరులకు సోకుతుంది. అత్యంత జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు మాత్రం ఎందరిని పరీక్షిస్తాయి? ఎందరి నమూనాలను ప్రయోగశాలలకు పంపిస్తాయి? ప్రజా రవాణా ఆరంభమయ్యాక స్ర్కీనింగ్ చేసినా ఇండోనేసియా నుంచి వచ్చిన యాత్రికుల్లాగా పారాసిటమాల్‌తో ఏమార్చరని హామీ ఏముంది? అందుకే నావెల్ కరోనా వైరస్ ఉన్న వ్యక్తుల్ని శునకాలు గుర్తిస్తే వారిని నేరుగా ఆస్పత్రికి తరలించి ఆర్టీ పీసీఆర్ వంటి టెస్టుల ద్వారా పక్కాగా నిర్ధారణ చేసుకోవచ్చు. బ్రిటన్‌లోని రెండు విద్యాసంస్థలు ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాయి.
మలేరియాను గుర్తించాయి
పోలీసు శునకాలు వాసన ద్వారా నేరస్థులను గుర్తించడం మనకు తెలిసిందే. ఇదే ఇవిధంగా మరి కరోనా వైరస్ అతిథేయులను అవి గుర్తించగలవా? అనే లక్ష్యంతో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ దుర్హమ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. గతంలో మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ బాధితులను శునకాలు గుర్తించాయి. ఈ పరిశోధన వివరాలు సైతం లాన్సెట్‌లో ప్రచురించారు. ఏదైనా వ్యాధి సోకినప్పుడు మానవుల శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ప్రత్యేకమైన వాసన జనిస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధుల్లో ప్రత్యేకమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ సోకినప్పుడూ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఊపిరితిత్తులపైనే వైరస్ ప్రభావం ఉంటుంది. శ్వాస సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ వైరస్ అతిథేయులను శునకాలు గుర్తిస్తాయో లేదో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అషర్, జాస్పర్, డిగ్బీ, నార్మన్, స్టోర్మ్ వంటి చురుకైన, తెలివైన శునకాలతో ప్రయోగాలు చేపట్టారు.
కొవిడ్-19పై శిక్షణ
ఈ ప్రయోగాల్లో కొవిడ్-19 బాధితుల మాస్క్‌లను వాసన చూసేలా శునకాలకు శిక్షణనిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పరికరంలో మాస్క్‌లు ఉంచుతారు. శునకాలతో పదేపదే వాసన చూపిస్తారు. కరోనా అతిథేయుల్లో ప్రత్యేకమైన వాసన ఏదైనా జనించిందా అని గమనిస్తున్నారు. ప్రయోగాలకు కొన్ని వారాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి కరోనా అతిథేయుల్లో ప్రత్యేక వాసన జనించిందో లేదో ఇంకా తెలియదని వారు చెబుతున్నారు. ఒకవేళ ఉంటే మాత్రం శునకాలు కచ్చితంగా గుర్తిస్తాయని విశ్వాసంగా ఉన్నారు. అప్పుడు కొవిడ్-19 కట్టడి, వైద్యంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.
గంటకు 750 మంది స్ర్కీనింగ్
‘ఇప్పటికే శునకాలు ఎన్నో విజయాలు సాధించాయి. శిక్షణ ద్వారా అవి కొవిడ్-19 గుర్తిస్తాయని నా నమ్మకం’ అని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ సీఈవో క్లెయిర్ గెస్ట్ అంటున్నారు. గంటకు 750 మందిని స్ర్కీనింగ్ చేయగల సామర్థ్యం శునకాలకు ఉంటుందని పేర్కొన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రజా రవాణా కేంద్రాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో వీటి అవసరం ఎంతో ఉంటుందన్నారు. కరోనా వైరస్ మాస్క్‌ల నుంచి శునకాలను జాగ్రత్తగా కాపాడుకోవడమే తమ ముందున్న సవాల్‌గా తెలిపారు. ఈ ప్రయోగాల్లో శునకాలు విజయం సాధిస్తే ర్యాపిడ్ టెస్టుల అవసరం భారీగా తగ్గుతుంది. జనసమూహంలో ఉన్న అతిథేయులను గుర్తించేందుకు వీలవుతుంది. సమాజంలో వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందో అవగాహన వస్తుంది.
-ఇంటర్నెట్‌డెస్క్
చదవండి: వీధి కుక్కల్లో వింత ప్రవర్తన