మద్యం విక్రయాలు పెరిగితే.. తగ్గాయంటారా?

ప్రధానాంశాలు

మద్యం విక్రయాలు పెరిగితే.. తగ్గాయంటారా?

నిజమేంటో సీఎం డ్యాష్‌బోర్డు లెక్కలు చెబుతున్నాయిగా!

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలోనే అతి పెద్ద లిక్కర్‌ డాన్‌ సీఎం జగన్‌రెడ్డి అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు. ‘సీఎం డ్యాష్‌బోర్డు గణంకాల ప్రకారం 2020 సెప్టెంబరు వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు 62.82 లక్షల కేసులుంటే.. ఈ ఏడాది 1.15 కోట్లకు చేరింది. దాదాపుగా 53 లక్షల కేసుల మద్యం విక్రయాలు పెరిగాయి. అదే బీరు అమ్మకాలు గతేడాది సెప్టెంబరు 23 నాటికి 14.97 లక్షల కేసులు ఉంటే, ఈ ఏడాది సెప్టెంబరుకు 36.59 లక్షలు విక్రయించారు. దాదాపుగా 53 లక్షల కేసుల ఐఎమ్‌ఎల్‌, 21 లక్షల బీరు అమ్మకాలు పెరిగితే సీఎం సిగ్గులేకుండా మద్యం అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు’ అని మండిపడ్డారు. నల్లధనం పోగేయడానికే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో నగదు మాత్రమే స్వీకరించాలనే నిబంధన తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాల్ని పెంచుతూ దొంగ సమీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా దశలవారీ మద్య నిషేధమంటే? అని ప్రశ్నించారు.
సేల్స్‌ ఎంకరేజ్‌మెంట్‌ బ్యూరోగా ఎస్‌ఈబీ: ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అనేది సేల్స్‌ ఎంకరేజ్‌మెంట్‌ బ్యూరోగా మారింది. ఇసుక అక్రమ రవాణాకు ఎలా సహకరించాలి? మద్యం అమ్మకాలను ఎలా పెంచాలనే దానిపైనే ఎస్‌ఈబీ దృష్టంతా ఉంది. పర్యాటకం, లిక్కర్‌ మాల్స్‌ పేరుతో రాష్ట్రంలో ఉన్న 3,500 మద్యం దుకాణాలకు అదనంగా మరికొన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇంకా ఎక్కువ తాగించడానికి 90 ఎమ్‌ఎల్‌ సీసాలను ప్రభుత్వమే మార్కెట్‌లోకి వదిలింది. అప్పు కోసం మద్యం అమ్మకాలను సీఎం తాకట్టు పెట్టారు’ అన్నారు.

నల్లధనమంతా హవాలా మార్గంలో తాలిబాన్లకు: ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో నగదు తప్ప మిగతా రూపాల్లో చెల్లింపులను ప్రభుత్వం అనుమతించడం లేదు. ఆఖరికి కూరగాయల వ్యాపారులు కూడా డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహిస్తుంటే.. సీఎం జగన్‌రెడ్డి మాత్రం నగదు చెల్లింపులను ఆశ్రయించారు. దీనిద్వారా సంపాదిస్తున్న నల్ల డబ్బంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు. దాన్ని పెట్టుబడిగా పెట్టి తాలిబన్ల నుంచి హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి రాష్ట్రానికి చేరవేస్తున్నారు’ అని ఆరోపించారు.

విజయవాడకు మాదకద్రవ్యాల దుకాణం ఎలా వచ్చింది?: ‘ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ నెలకొల్పిన సుధాకర్‌కు ఎంత ధైర్యం లేకపోతే విజయవాడ నడిబొడ్డున మాదకద్రవ్యాల దుకాణం నిర్వహిస్తారు? ఆయనకు సహకరిస్తున్న వైకాపా పెద్దలెవరు? ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో మాదకద్రవ్యాల ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారంటే ఎవరి అండతో చేస్తున్నారో డీజీపీకి తెలియదా? ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ, మాచవరపు సుధాకర్‌, ఆయన భార్య వైశాలిపై డీజీపీ ఏ దర్యాప్తు చేయించారో సమాధానం చెప్పాలి. ఎవరిని విచారించి, ఏం తేల్చారని డీజీపీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు’ అని ప్రశ్నించారు. ‘మేం లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానం చెబుతారా? లేక సజ్జల బయటికి వస్తారా? నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులకూ అనుమతించాలి’ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని