close

సినిమా

బడ్జెట్‌ పరంగా ఎప్పుడూ హద్దులు దాటలేదు

తొలి చిత్రం ‘స్వామి రారా’తోనే ప్రతిభగల దర్శకుడు అనిపించుకొన్నారు సుధీర్‌వర్మ. ‘దోచేయ్‌’తో పరాజయాన్ని చవిచూసినా, ‘కేశవ’తో మరోసారి ఆసక్తిని రేకెత్తించేలా కథ చెప్పడంలో దిట్ట అనే ప్రశంసలు పొందారు. ఇటీవల ఆయన శర్వానంద్‌ కథానాయకుడిగా గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ‘రణరంగం’ తెరకెక్కించారు. ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధీర్‌వర్మ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

శర్వానంద్‌తో గ్యాంగ్‌స్టర్‌ కథ చేయాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది?
శర్వానంద్‌తో సినిమా అనుకొన్నాక తనని గాఢతతో కూడిన పాత్రలోనే చూపించాలనే నిర్ణయానికొచ్చా. ఆయన సినిమాల్లో నాకు ‘ప్రస్థానం’ చాలా ఇష్టం. ఇటీవల ప్రేమకథలు, కుటుంబ కథలు చేశాడు, అవి విజయవంతం అయ్యాయి కానీ.. నేను అలాంటి సినిమాలు చేయాలనుకోలేదు. ‘రణరంగం’ కథని మొదట రవితేజతో చేయాలనుకొన్నా. నేను, శర్వా కథల గురించి చర్చించుకొనేటప్పుడు తదుపరి రవితేజతో ఈ కథ చేస్తున్నానని చెప్పా. అప్పుడు శర్వా ‘అది మనం చేద్దాం, నాకూ   ఛాలెంజింగ్‌గా ఉంటుంది’ అన్నాడు. లుక్‌ టెస్ట్‌ చేసి చూసుకొన్నాక శర్వాతో ఈ కథ చేయొచ్చనిపించింది. అప్పుడు రవితేజని కలిసి ‘మనం వేరే కథ చేద్దాం’ అని చెప్పా. ఆయన సరే అన్నారు.

‘రణరంగం’ కథకి స్ఫూర్తి?
గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలకి స్ఫూర్తి అంటే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాల నుంచే వస్తుంది. వాటి ప్రభావం అలాంటిది. ‘గాడ్‌ఫాదర్‌ 2’ ద్వితీయార్ధపు స్క్రీన్‌ప్లే స్ఫూర్తితో కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దా. అయితే ఈ సినిమా సాగే నేపథ్యం కొత్తగా ఉంటుంది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 1990వ దశకంలో రెండేళ్లపాటు మద్యపాన నిషేధం అమలైంది. ఆ నేపథ్యానికి వర్తమానాన్ని మేళవించి ఈ సినిమాని తీశా.

రవితేజ చేయాల్సిన పాత్రలో శర్వానంద్‌ని చూసుకోవడం మీకెలా అనిపించింది?
శర్వానంద్‌ ఇందులో రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఈ కథకి రవితేజ కాకుండా, శర్వానంద్‌ని అనుకొన్నప్పుడు నాకు ఒక్కటే ఆలోచన. నలభయ్యేళ్ల పైబడిన వ్యక్తి పాత్రలో శర్వా ఎలా ఉంటాడో అని? కానీ లుక్‌ టెస్ట్‌ చేసినప్పుడే శర్వా కనిపించిన విధానం, తన హావభావాలు పక్కాగా ఉన్నాయనిపించింది.

ప్రేమకథలకి దూరంగా ఉంటున్నారు. కారణమేంటి?
ఎలాంటి సినిమాలు ఇష్టమో అవే తీయాలనిపిస్తుంది. నాకు నేరం నేపథ్యంలో సాగే సినిమాలంటే ఇష్టం. అయితే ఈ సినిమాలో శర్వానంద్‌, కల్యాణి ట్రాక్‌ని చూసుకొన్నాక ప్రేమకథ కూడా తీయొచ్చు అనిపించింది.

నిర్మాణ వ్యయం విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
నిర్మాత వంశీ నాకు ఈ సినిమాకి బడ్జెట్టు ఎంతైందో ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు తీయ్‌ అన్నాడంతే. బడ్జెట్‌ పరంగా నేనెప్పుడూ హద్దులు దాటలేదు. దాంతో సమస్య రాదు.

వెబ్‌ సిరీస్‌లకి ఆదరణ పెరుగుతోంది కానీ ఎప్పటికైనా సినిమా సినిమానే. ఇంట్లో కూర్చుని చూసే వెసులుబాటు ఏర్పడినా ప్రేక్షకులు థియేటర్‌లకే వెళతారు. అక్కడ ప్రేక్షకులకు లభించే అనుభూతి వేరు. పైరసీ పెరిగాక చాలామంది మొబైళ్లలో  సినిమాలు చూస్తున్నారు. కానీ వినోదాన్ని ఆస్వాదించలేరు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు