ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో 15-17%వృద్ధి - Private Hospitals revenue has been increased by 15 to 17 pc
close

Published : 23/06/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో 15-17%వృద్ధి

కొవిడ్‌-19 బాధితుల వల్లే: క్రిసిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదు కావడానికి తోడు బాధితులు ఎంతోమంది ఆసుపత్రుల పాలయ్యారు. మూడోదశ ప్రబలుతుందనే ఆందోళనలూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో 15-17శాతం వృద్ధి కనిపించేందుకు ఇవన్నీ కారణం కావచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతితో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, ఆసుపత్రులకు ఆదాయాలూ బాగా పెరిగాయని తెలిపింది. 2020-21లో ఆర్జించిన మొత్తంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రుల ఆదాయాలు 15-17% వరకు అధికంగా ఉండవచ్చని వెల్లడించింది. దీనివల్ల నిర్వహణ లాభాలు 100-200 బేసిస్‌ పాయింట్లు పెరిగి, 13-14శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ నిష్పత్తి 75శాతానికి మించే ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మనీష్‌ గుప్తా అన్నారు. కొన్ని శస్త్రచికిత్సల కోసం వచ్చిన వారి సంఖ్య తగ్గినప్పటికీ.. కొవిడ్‌ బాధితులు అధికంగా ఉండటంతో ఆసుపత్రుల్లో చేరికలు తగ్గలేదని వివరించారు. జులై-సెప్టెంబరులో కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇతర చికిత్సల కోసం వచ్చేవారితో పడకలు నిండుతాయని క్రిసిల్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. ఈసారి ఇది 65-70శాతానికి తగ్గకుండా ఉండే అవకాశం ఉందని గుప్తా పేర్కొన్నారు. ఆదాయం, లాభాల్లో వృద్ధి నమోదు కావడం వల్ల విస్తరణకు ఆసుపత్రులు ప్రణాళికలు వేసే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది. ఇందులో ఇతర ఆసుపత్రుల స్వాధీనం, పడకల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక వసతుల కల్పన లాంటి వాటికి ప్రాధాన్యం ఉండవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి కార్తిగేయన్‌ పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని