close

Published : 03/03/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్‌షా

బిలియనీర్ల జాబితాలో ఇక్కడివారు 10 మంది
2020లో కొత్తగా దేశీయులు 40 మంది  
8300 కోట్ల డాలర్ల సంపదతో ముకేశ్‌ అంబానీయే నం.1

ప్రపంచ కుబేరుల జాబితాలో హైదరాబాద్‌ జెండా రెపరెప లాడుతోంది. వందకోట్ల డాలర్లకు పైగా సంపద  కలిగిన కుబేరులు (బిలియనీర్లు) ఈ నగరం నుంచి 10 మంది ఉండగా, వీరిలో ఏడుగురు ఔషధ రంగం నుంచే ఉన్నారు. మిగిలిన ముగ్గురు నిర్మాణ, మౌలిక సదుపాయాల సంస్థల అధిపతులు. వీరి సంపద విలువ రూ.1.66 లక్షల కోట్లు.

ముంబయి: కరోనా మహమ్మారి సంక్షోభ ఏడాది (2020)లోనూ దేశంలో 40 మంది బిలియనీర్లు జతచేరడంతో, భారత కుబేరుల సంఖ్య 177కు చేరిందని హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2021 వెల్లడించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగారు. ఈయన సంపద గతేడాదిలో 24 శాతం పెరిగి 8300 కోట్ల డాలర్ల (దాదాపు రూ.6.05 లక్షల కోట్ల)కు చేరింది. అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా గౌతమ్‌ అదానీ సంపద కూడా పెరుగుతూనే ఉంది. 2020లో అయితే ఏకంగా రెండింతలై 3200 కోట్ల డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఆయన 20 స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలబడ్డారు. దేశంలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు వినోద్‌ సంపద కూడా 128 శాతం వృద్ధితో 980 కోట్ల డాలర్లకు చేరింది.  2700 కోట్ల డాలర్లతో హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ భారతీయుల్లో మూడో స్థానంలో నిలిచారు. జెడ్‌కాలర్‌కు చెందిన జేచౌదరీ సంపద 274% పెరిగి 1300 కోట్ల డాలర్లకు; బైజూస్‌ రవీంద్రన్‌ - కుటుంబ సంపద 100% పెరిగి 280 కోట్ల డాలర్లకు చేరింది. మహీంద్రా గ్రూప్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్రా కుటుంబ సంపద 100% అధికమై 240 కోట్ల డాలర్లకు చేరింది. పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం క్షీణించి 360 కోట్ల డాలర్లకు చేరింది.

అతిపిన్న వయస్కుల్లో నిఖిల్‌ కామత్‌: భారత కుబేరుల జాబితాలో అతిపిన్న వయస్కులుగా జెరోధాకు చెందిన నిఖిల్‌ కామత్‌(34); ఇన్‌స్టాకార్ట్‌కు చెందిన అపూర్వ మెహతా(34) నిలిచారు.

ఎక్కువ మంది స్వయం కృషితోనే..

ముంబయిలో అత్యధికంగా 60 మంది కుబేరులుండగా.. దిల్లీలో 40, బెంగళూరులో 22 మంది చొప్పున బిలియనీర్లున్నారు. మహిళల్లో బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా(480 కోట్ల డాలర్లు), గోద్రేజ్‌కు చెందిన స్మిత వి క్రిష్ణ(470 కోట్ల డాలర్లు); లుపిన్‌ సంస్థకు చెందిన మంజు గుప్తా(330 కోట్ల డాలర్లు) ముందు నిలిచారు. మొత్తం 177 మంది భారత కుబేరుల్లో 118 మంది స్వయం కృషితో ఈ స్థాయికి చేరినవారే. చైనాలో మొత్తం 1058 మంది కుబేరులుండగా.. అందులో 932 మంది సొంతంగా ఉన్నతస్థాయికి ఎదిగిన వారే.

అంతర్జాతీయంగా చూస్తే..: ప్రపంచ వ్యాప్తంగా గతేడాదిలో మొత్తం 414 మంది జత చేరడంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 3228 మందికి చేరింది. 1058 మందితో చైనా అగ్రస్థానంలో ఉంటే, 696 మందితో అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 32% వృద్ధితో 14.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ 19700 కోట్ల డాలర్లతో అగ్రాసనాన్ని అధిరోహించారు. ఆయన సంపద 328 శాతం పెరగడం విశేషం. అమెజాన్‌కు చెందిన జెఫ్‌బోజెస్‌ 18900 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఎల్‌వీఎమ్‌హెచ్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 11400 కోట్ల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా, చైనాల తరహాలో భారత్‌ కూడా సాంకేతిక పరిశ్రమలు పూర్తి స్థాయిలో పుంజుకుంటే బిలియనీర్ల సంఖ్య విషయంలో అమెరికాను భారత్‌ అధిగమించగలదని హురన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహమాన్‌ జునైద్‌ అంచనా వేశారు.

హైదరాబాద్‌ బిలియనీర్లు వీరే: హైదరాబాద్‌కు చెందిన 10 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ ఈ ఏడాది జనవరి 15 నాటికి రూ.1,65,900 కోట్లు (2260 కోట్ల  డాలర్లు) అని జాబితా పేర్కొంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని