..ఇదీ అజిత్‌ అంటే..! - ajith birthday special story
close
Published : 01/05/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

..ఇదీ అజిత్‌ అంటే..!

స్టార్‌ హోదా అనుభవిస్తూ సైకిల్‌పై ఎవరు ప్రయాణం చేయగలరు? ఒక్కో చిత్రంతో కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ సాధారణ వ్యక్తిగా ఉండటం ఎవరికి సాధ్యం? ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండే మనస్తత్వం ఎవరి సొంతం? పడినా లేచి యథాస్థితికి చేరుకునే ధైర్యం ఎవరిది? ఇలాంటి అసాధారణ ప్రశ్నలకు ఓ సమాధానమే అజిత్. సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే ఈ నటుడి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అజిత్‌లో దాగి ఉన్న మరికొన్ని కోణాల్ని ఓసారి చూద్దామా..

ఇక్కడే పుట్టారు..

సుబ్రహ్మమణియన్‌- మోహిని దంపతులకు 1971 మే 1న హైదరాబాద్‌లో జన్మించారు అజిత్‌. ఈయనకు ఇద్దరు సోదరులు. ఉన్నత విద్య అభ్యసించడాని కంటే ముందే కుటుంబ సన్నిహితుడి ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో అప్రెంటీస్‌ మెకానిక్‌గా చేరారు అజిత్‌. అది వాళ్ల నాన్నకి నచ్చకపోవడంతో మరొక సన్నిహితుడి ప్రమేయంతో వస్త్ర ఎగుమతి సంస్థలో చేరారు. అలా వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. అక్కడే ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. కొన్నాళ్లకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. దాంతోపాటు మోడలింగ్‌కి సంబంధించి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగింది అజిత్‌కి. అలా ఓసారి ప్రముఖ మోటారు కంపెనీకి వెళ్లినప్పుడు ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ అజిత్‌లోని నటుడ్ని గుర్తించారు. ఆ మెకానిక్కే ఇప్పుడు తలా అజిత్‌గా మారి సంచనాలు సృష్టిస్తున్నారు.

తలా.. ఇలా వచ్చింది

1990లో ‘ఎన్‌ వీడు ఎన్‌ కనవర్‌’ అనే చిత్రంతో నటుడిగా తెరంగ్రేటం చేశారు అజిత్. అందులో ఓ చిన్న పాత్రకి పరిమితమైనా ఆయన 1993లో ‘అమరావతి’ సినిమాతో కథానాయకుడిగా మారారు. అదే సంవత్సరంలో ‘ప్రేమ పుస్తకం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. అజిత్‌ నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే. ‘ప్రియురాలి పిలిచింది’, ‘వాలి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నారు. లవర్‌బాయ్‌, క్లాస్ పాత్రల్లో కనిపించిన అజిత్‌ని మాస్‌ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం ‘ధీన’. ఎ.ఆర్‌. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నటుడిగా ఆయన స్థాయిని పెంచింది. అందులో పోషించిన పాత్ర పేరే అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది. తమిళం, తెలుగుతోపాటు ‘ఆశోక’ అనే హిందీ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించారు. ‘విలన్‌’, ‘జి’, ‘ఆల్వార్‌’, ‘కిరీదం’, ‘బిల్లా’, ‘బిల్లా 2’, ‘ఆరంభం’, ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ తదితర చిత్రాలు అజిత్ నట విశ్వరూపానికి నిదర్శనం. అజిత్ ప్రస్తుతం ‘వలిమై’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌ కావాలంటూ క్రికెట్‌ మైదానంలోనూ ఇటీవల అభిమానులు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అజిత్‌ ఫాలోయింగ్‌ని అందరికీ తెలియజేసింది. ఇలా అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ విశేష అభిమాన గణాన్నే కాదు అనేక అవార్డులు రివార్డుల్ని సొంతం చేసుకున్నారు.

పడినా లేచి..

తొలి సినిమా విడుదల తర్వాత రేసింగ్‌ వైపు మనసు మళ్లింది అజిత్‌కి. ఆ శిక్షణా సమయంలోనే ఆయన వెన్నెముకకి తీవ్ర గాయమైంది. మూడు శస్త్ర చికిత్సలు కాగా సుమారు రెండేళ్లు విశ్రాంతి తీసుకున్నారు. కోలుకున్నాక పలు సహాయ పాత్రల్లో నటించారు. ‘ఆశై’ అనే సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అందులోని అజిత్‌ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సినీ కెరీర్‌ పరంగా అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. రేసింగ్‌లో ఓ సారి దెబ్బతగిలిందని అక్కడితో దాన్ని వదిలేయలేదు అజిత్‌. దాన్నీ ఓ కెరీర్‌గా ఎంచుకున్నారు. ఎన్నో విదేశీ పోటీల్లో పాల్గొన్ని సత్తా చాటారు. రేసరే కాదు అజిత్‌లో ఫొటోగ్రాఫర్‌, చెఫ్‌ కూడా ఉన్నారు. ఆ సంగతులివీ..

రేసర్‌గా అజిత్‌..

‘బీఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్‌ జరుగుతున్నప్పుడు మొదటిసారి నేను అజిత్‌ని కలిశాను. ఆయన పెద్ద స్టార్‌ అయినప్పటికీ అందరితోనూ వినయంగా ఉంటారని అప్పుడే తెలిసింది. బ్రెజిల్ రేసర్‌ ఐర్టన్‌ సెన్నాకి అజిత్‌ వీరాభిమాని తను. సెన్నాకి నివాళిగా హెల్మెట్ మీద పసుపు రంగు పెయింటింగ్‌ని తీర్చిదిద్దారు అజిత్‌. బైక్ ట్రిప్‌కి వెళ్లే అవకాశం వచ్చిన సమయంలో ఓసారి అజిత్‌ ఇంటికి వెళ్లాను. తన గ్యారేజీలో ఉన్న కార్లని చూసి ఆశ్చర్యపోయాను. కార్లు ఎక్కువగా ఉండటం గొప్ప విషయం కాదు వాటిని ఎంత జాగ్రత్తగా చూస్తున్నామో అన్నదే పాయింట్‌. దాన్ని నేను అజిత్ నుంచి నేర్చుకున్నాను. రైడింగ్‌ అంటే అజిత్‌కి ప్యాషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉత్సాహం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల్ని నడపకూడదు అంటుంటారాన. నీ దగ్గర రాకెట్ వేగంతో దూసుకెళ్లే బైక్‌ ఉన్నంత మాత్రాన ముందూ వెనకా చూడకుండా ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తారు. ఇదీ ఆయన పద్ధతి. అజిత్‌ నిజంగా మంచి వ్యక్తేనా అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అవును.. అజిత్‌ గురించి మీరు విన్నదంతా వందశాతం నిజం అని సమాధానం ఇస్తుంటాను నేను’ అని ప్రముఖ రేసర్‌ సుహైల్‌ ఓ సందర్భంలో అజిత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

చెఫ్‌గా‌‌..

అజిత్‌ రేసర్‌ మాత్రమే కాదు మంచి వంట మనిషి కూడా. షూటింగ్‌ లేని రోజున ఆయన బిర్యానీని ఘుమఘుమలాడించేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు సైతం అజితే తీసుకెళ్తారు. 2011లో అజిత్‌ నివాసానికి దగ్గర్లో విజయ్‌ హీరోగా రూపొందిన ‘వేలాయుధం’ చిత్రీకరణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్‌ చిత్ర బృంద సభ్యులందర్నీ ఆహ్వానించి, తనే స్వయంగా భోజనం ఏర్పాటు చేశారు. అదీ అజిత్‌ మనసు.

ఫొటోగ్రాఫర్‌గా..

గ్యారేజీలో బైకులు, కార్లు ఉన్నట్లే అజిత్‌ ఇంటి అలమరాల్లో కెమెరాలు, వాటికి సంబంధించిన బోలెడు లెన్సులు ఉంటాయనే సంగతి కొంతమందికే తెలుసు. వాటిని చూసి ‘బిల్లా’ (తమిళం) చిత్ర ఫొటోగ్రాఫర్‌ చిట్టునే షాక్‌ అయ్యాడంటే అజిత్‌కి ఫొటోగ్రఫీపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ కొత్త మోడళ్ల గురించి అవగాహన పెంచుకుంటుంటారు. సినిమాటోగ్రఫీపై అజిత్‌కి ఆసక్తి మాత్రమే కాదు మంచి అవగాహన ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయనే ఫొటోగ్రాఫర్‌గా మారిపోతారు. సెట్‌లో ఉండే లైట్‌మెన్‌ నుంచి అగ్ర తార వరకు అందరినీ తన కెమెరాతో అందంగా బంధిస్తారు. ఇదీ అజిత్‌ వ్యక్తిత్వం. చెన్నైలో పెద్ద స్టూడియో నిర్మించాలనేది అజిత్‌ కల.

ఫ్లయర్‌గా..షూటర్‌..

రయ్‌రయ్‌మంటూ విహంగ వీక్షణం చేయడం అజిత్‌కి మహా సరదా. విద్యార్థి దశ నుంచే గగనతలంలో ప్రయాణించే వాటిపై మక్కువ చూపేవారాయన. వయసుతోపాటు ఆ ఆసక్తి పెరుగుతూ వచ్చింది. సినిమాలతో తనెంత బిబీగా ఉన్నా ఎయిర్‌క్రాఫ్టులు నడపడం నేర్చుకున్నారు. ఇక అజిత్‌కు గన్‌ షూటింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తమిళనాడు స్టేట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్లబ్‌ టీమ్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇటీవల జరిగిన పోటీల్లో ఆయన ఆరు పతకాలను గెలుచుకోగా.. అందులో నాలుగు స్వర్ణ పతకాలు.

ప్రేమ.. పెళ్లి

‘అమర్కలం’ అనే చిత్రం షూటింగ్ సమయంలో నాయిక షాలినితో ప్రేమలో పడ్డారు అజిత్‌. 2000లో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు.


సంపన్నుడిగా..

ప్రతిఏటా ఫోర్బ్స్‌ ప్రకటించే అత్యంత సంపాదన కలిగిన ప్రముఖుల జాబితాలో మూడుసార్లు నిలిచారు అజిత్‌.


బైక్‌పై సవారి..

గతేడాది హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంది ‘వలిమై’ చిత్రం. సంబంధిత షెడ్యూల్‌ పూర్తికాగానే బైక్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టొద్దు, పాలాభిషేకాలు చేయొద్దు, ఎలాంటి హంగామా, వేడుకలు వద్దు.. ఇవీ తన సినిమా విడుదలకు ముందు అభిమానులకి అజిత్‌ చెప్పే మాటలు. ఆయన ప్రవర్తనకు ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అవుతుండటం విశేషం.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని