Manalo Manam: కన్నవాళ్లు రమ్మంటే..భార్య వద్దంటోంది

నేనొక అమ్మాయిని ప్రేమించా. మా మతాలు వేరు కావడంతో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. గుళ్లో పెళ్లి చేసుకున్నాం. సిటీకొచ్చి ఇద్దరం చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాం

Updated : 11 Nov 2023 08:05 IST

నేనొక అమ్మాయిని ప్రేమించా. మా మతాలు వేరు కావడంతో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. గుళ్లో పెళ్లి చేసుకున్నాం. సిటీకొచ్చి ఇద్దరం చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాం. మొదట్లో తిండికి కూడా గడవక చాలా ఇబ్బందిగా ఉండేది. ఈమధ్యే మాకో పాప పుట్టింది. బంధువులు, స్నేహితులు సాయం చేస్తే గట్టెక్కాం. ఇప్పుడు మావాళ్లు ఇంటి కొచ్చేయండి అంటున్నారు. నా భార్య ఒప్పుకోవడం లేదు. ‘వెళ్తే చులకనవుతాం. కష్టపడి సొంతకాళ్లపై నిలబడదాం’ అంటోంది. నేనేం చేయాలి?
సాయికృష్ణ, ఆదిలాబాద్‌

అసలు ప్రేమ పెళ్లి అంటేనే బోలెడు సవాళ్లు. అందులోనూ మీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. ప్రేమ కోసం ఇంట్లోవాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా ముందుకెళ్లారు సరే.. సరైన ఉద్యోగం లేకుండానే ఆ అమ్మాయిని ఏ భరోసాతో పెళ్లాడారు? వేరే కులం, మతం అమ్మాయి అయితే సహజంగానే బంధువులు, సమాజం నుంచి కొంత నిరాదరణ ఎదురవుతుంది. ఇవన్నీ ముందే ఆలోచించి ఉండాల్సింది. ఇంతకీ మీ వయసెంతో చెప్పలేదు. సరే ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. వాళ్ల మాట వినలేదు అనే కోపంతో, బహుశా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు మనసు కరిగి ఉంటుంది. మనవరాలిని చూడాలని తహతహలాడుతూ ఇంటికి రమ్మని అడుగుతున్నారేమో! వాళ్లు ప్రేమగా పిలిచినప్పుడు వెళ్లి సాయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. కన్నవాళ్లు ఓ మాట అన్నా.. పడితే పోయేదేమీ లేదు. కానీ ఇప్పుడు మీరు ఒక్కరు కాదు.. ముగ్గురు. వెళ్తే చులకన అవుతాం అని మీ భార్య సందేహించడం సబబే. ఆమెకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీమీదే ఉంది. ఇంటికి రమ్మంటున్న మీ కన్నవాళ్లతో ఆ విషయం చర్చించండి. వాళ్లని బతిమాలి అయినా ఆమెకెలాంటి ఇబ్బంది ఉండదని వాళ్లతో చెప్పించండి. అదే సమయంలో మీ పెద్దవాళ్ల మనసు గెలుచుకునేలా ప్రవర్తించమని మీ భార్యకి సూచించండి. మీరు ఇంటికి వెళ్తే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. ఒకరికొకరు తోడుగా ఉంటే.. ఆర్థిక పరిస్థితీ మెరుగవుతుంది. మీ చిన్నపాపకి పెద్దవాళ్ల ఆప్యాయత దక్కుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ భారంగా భావించరు. ఆత్మాభిమానం దెబ్బ తింటుందనో, అనవసర ఇగోలకు వెళ్లో.. బంధాలను దూరం చేసుకోవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని